పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:37 PM
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం శాతాన్ని వినియోగదారులకు తప్పనిసరిగా వెల్లడించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.
ఢిల్లీ, ఆగస్టు 31: పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం ఎంత శాతం ఉందో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. పెట్రోల్ బంకుల్లోని నోజిళ్లపై.. అలాగే వినియోగదారులకు ఇచ్చే పెట్రోల్ బిల్లులపై ఇంధనంలో కలిపిన ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.కె.గోస్వామి కోరారు. వినియోగదారులు తమ వాహనాల్లో వినియోగిస్తున్న ఇంధనం ఏ కాంపోజిషన్‌తో ఉందో తెలుసుకునే హక్కు కలిగి ఉన్నారని పిటిషనర్ వాదించారు. ముఖ్యంగా E20 పెట్రోల్ వినియోగం నేపథ్యంలో వాహనాలపై దాని ప్రభావం.. పాత వాహనాల అనుకూలత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ గట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే కొట్టివేసిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పిటిషనర్ ఎన్.కె. గోస్వామి సంబంధిత హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది. E20 పెట్రోల్‌పై వాహనాల అనుకూలతకు సంబంధించిన సమగ్ర డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని.. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కూడా పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఇథనాల్ మిశ్రమం వివరాలను వినియోగదారులకు తెలియజేయాలన్న అంశం తదుపరి దశలో సంబంధిత హైకోర్టు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
మియాపూర్‌లో విషాదం.. చదువు రావడం లేదనే మనస్తాపంతో
రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం
Read Latest AP News And Telugu News