Share News

రాష్ట్రపతి పాలన నివారించేందుకే అలా చేశాం... స్టాలిన్

ABN , Publish Date - Jun 06 , 2026 | 09:18 PM

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమి పక్షాలను డీఎంకే అనుమతించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నిరోధించాలనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని అన్నారు.

రాష్ట్రపతి పాలన నివారించేందుకే అలా చేశాం... స్టాలిన్
MK Stalin with Vijay

చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమి పక్షాలను డీఎంకే అనుమతించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నిరోధించాలనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని అన్నారు. శనివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాడీఎంకేకు చెందిన పలువురు నేతలు డీఎంకేలో చేరడాన్ని స్టాలిన్ స్వాగతించారు.


'డీఎంకే భాగస్వామ్య పార్టీలు తమ ఆలోచనలను నాకు చెప్పగానే, మీరు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు, అది మీ ఇష్టం, ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు, మిమ్మల్ని ఆపేది లేదు అని చెప్పాను. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా నిరోధించాలనే ఏకైక ఉద్దేశంతోనే అలా చేశాను. ఆ పని చేయకపోతే తమిళనాడులో బీజేపీ పాలనకు మార్గం సుగమం అయ్యేది' అని స్టాలిన్ అన్నారు. తమ కూటమిలోని పార్టీల మద్దతు వల్లే ప్రస్తుత ప్రభుత్వం (టీవీకే) నడుస్తోందన్నారు. తమతో నడిచిన పార్టీలన్నీ డీఎంకే అధికారంలోకి రావాలని కోరుకునే తమతో పెత్తుపెట్టుకున్నాయని చెప్పారు.


జయాపజయాలు సహజమేనని, తాము విజయం వచ్చినప్పుడు పొంగిపోలేదని, పరాజయం ఎదురైనందుకు కృంగిపోయేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. విజయాన్ని కోల్పోయినా, అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజాసేవ చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే 108 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. అయితే పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఇతర పార్టీల సాయం తీసుకుంది. డీఎంకే భాగస్వామ్య పార్టీలుగా రెండేసి సీట్లు చొప్పున గెలుచుకున్న సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు టీవీకేకు మద్దతు తెలిపాయి. డీఎంకే కూటమిలో 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసి అధికారం పంచుకుంది.


ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకేకు షాక్.. మాజీ మంత్రులతో సహా 300 మంది టీవీకేలో చేరిక

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..

Updated Date - Jun 06 , 2026 | 09:50 PM