Share News

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:35 AM

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పునర్విభజన విషయంలో రాజకీయం చేస్తోందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ఆరోపించారు

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం
dk sivakumar

  • దేశంలో మైనారిటీలో పడిపోతాం

  • కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ఆందోళన

  • నేడు రేవంత్‌, సతీశన్‌ సహా దక్షిణ రాష్ట్రాల సీఎంలతో భేటీ

బెంగళూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పునర్విభజన విషయంలో రాజకీయం చేస్తోందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ఆరోపించారు. కేంద్రం ప్రతిపాదించినట్లు పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారం బెంగళూరులో నిర్వహిస్తున్నామని.. కేరళ సీఎం వీడీ సతీశన్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు హాజరవుతారని తెలిపారు. తాజా ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలు దేశ రాజకీయ వ్యవస్థలో మైనారిటీలో పడిపోయే ప్రమాదం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ గళాన్ని బలంగా వినిపించదలిచామని అన్నారు. డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం జరుపుతారని భావించామని.. కేంద్రం అలా చేయలేదని ఆక్షేపించారు. ఈ అంశంపై దక్షిణ భారత రాష్ట్రాలతో సమాలోచనలు జరపాల్సిందన్నారు. డీలిమిటేషన్‌తో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే లోక్‌సభ స్థానాలు 120కి పెరుగుతాయని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య వ్యత్యాసం పెరుగుతుందని మాజీ సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం సీట్లను పెంచితే కర్ణాటకతోపాటు పొరుగురాష్ట్రాల గళం ఏ విధంగా బలోపేతమవుతుందని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించి పునర్విభజనపై చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు.


కర్ణాటకలో 50 శాతం సీట్లు పెంచితే లోక్‌సభ స్థానాలు 28 నుంచి 42కి పెరుగుతాయని.. కానీ యూపీలో 80 నుంచి 120కి పెరుగుతాయని.. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న వ్యత్యాసం 52 నుంచి 72 స్థానాలకు పెరుగుతుందని విశ్లేషించారు. తమ రాష్ట్రానికి రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్యాయం జరగకూడదని.. సమాఖ్య వ్యవస్థలో సమానత్వం, ప్రగతికి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని తాము కోరుతున్నామని తెలిపారు

ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

Updated Date - Nov 29 , 2026 | 05:35 AM