Share News

డొనాల్డ్ ట్రంప్ మా గ్యారెంటీ స్కీమ్స్‌ను కాపీ కొడుతున్నారు: డీకే శివకుమార్..

ABN , Publish Date - Sep 15 , 2026 | 01:02 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలను ట్రంప్ కాపీ కొడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయని శివకుమార్ వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్ మా గ్యారెంటీ స్కీమ్స్‌ను కాపీ కొడుతున్నారు: డీకే శివకుమార్..
Karnataka CM DK Shivakumar

బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా కాంగ్రెస్ హామీలనే కాపీ కొడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘బ్లాక్‌బస్టర్‌’ అయ్యాయని శివకుమార్ వ్యాఖ్యానించారు.


బెంగళూరులో ఇవాళ (మంగళవారం) డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ఇదే సమయంలో అమెరికా రాజకీయాల్లో ట్రంప్ తాజాగా చేసిన ఓ హామీని ఆయన ప్రస్తావించారు. నవంబర్‌లో జరిగే మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభ, సెనెట్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తే.. ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్ల చొప్పున ‘డివిడెండ్‌’ అందిస్తామని ట్రంప్ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ హామీలను ఆయన కాపీ కొడుతున్నారని శివకుమార్ చెప్పుకొచ్చారు.


కాగా, ఐర్లాండ్‌లో గత ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి వయోజనుడికి 5,000 డాలర్లు ఇవ్వడం సాధ్యమేనని చెప్పారు. అమెరికా ప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం సమీకరిస్తోందని, అందువల్ల ఈ డబ్బు చెల్లింపు పెద్ద సమస్య కాదని అన్నారు. గతంలో డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ తొలిసారి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోకి భారీగా ఆదాయం వస్తోందని, దీంతో ప్రజలకు 5,000 డాలర్లు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ డీకే శివకుమార్ పైవిధంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మోదీతో ఫొటోకు ‘తుఝే దేఖా తో’.. పుతిన్‌తో ‘చలే చలో’.. మలేషియా ప్రధాని బాలీవుడ్ ప్లేలిస్ట్ వైరల్..

మహిళా బైకర్ సియా హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడిపై హత్యాయత్నం సెక్షన్‌ జోడించిన పోలీసులు

Updated Date - Sep 15 , 2026 | 01:07 PM