Share News

మోదీతో ఫొటోకు ‘తుఝే దేఖా తో’.. పుతిన్‌తో ‘చలే చలో’.. మలేషియా ప్రధాని బాలీవుడ్ ప్లేలిస్ట్ వైరల్..

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:05 AM

భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇటీవల 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల అగ్రనేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాల ప్రతినిధులు తమ పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మోదీతో ఫొటోకు ‘తుఝే దేఖా తో’.. పుతిన్‌తో ‘చలే చలో’.. మలేషియా ప్రధాని బాలీవుడ్ ప్లేలిస్ట్ వైరల్..
Malaysia PM Anwar ibrahim

న్యూఢిల్లీ: భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇటీవల 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల అగ్రనేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాల ప్రతినిధులు తమ పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాత్రం తన పోస్టులతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. భారత్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలకు ఆయన ఎంచుకున్న బాలీవుడ్ పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయా సందర్భాలకు తగ్గట్టుగా పాటలను ఎంచుకోవడంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా భారత్ మండపానికి తనకు స్వాగతం పలికిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను మలేషియా ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలోని ‘తుఝే దేఖా తో యే జానా సనం’ పాటను జత చేశారు. మోదీతో కలిసి ఉన్న మరో ఫొటోనూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీనికి షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ నటించిన ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘దిల్ తో పాగల్ హై’ పాటను ఎంచుకున్నారు.


అలాగే, బ్రిక్స్‌ సదస్సులో ప్రసంగిస్తున్న తన ఫొటోలకు కూడా బాలీవుడ్ పాటనే అన్వర్ ఇబ్రహీం జత చేశారు. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా నటించిన 2000 నాటి ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ సినిమాలోని అదే పేరుతో ఉన్న ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ పాటను ఉపయోగించారు. భారత్ నుంచి తిరుగు ప్రయాణానికి సంబంధించిన షార్ట్ వీడియోలకు ‘లక్ష్య’ సినిమాలోని ‘కంధోం సే మిల్తే హై కంధే’ పాటను ఎంచుకున్నారు. ఈ రెండు పాటలు కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశాన్ని అందిస్తాయి.


భారత్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా అన్వర్ ఇబ్రహీం కలిశారు. వారితో కలిసి భోజనం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన.. వాటికి షారుక్ ఖాన్, ప్రీతి జింటా నటించిన ‘వీర్-జారా’ సినిమాలోని ‘ఐసా దేశ్ హై మేరా’ పాటను జత చేశారు. భారతదేశంలోని భిన్న సంస్కృతులు, వైవిధ్యాన్ని చాటే ఈ పాటను ఆ సందర్భానికి అనుగుణంగా మలేషియా ప్రధాని ఎంచుకున్నారు.


ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో సమావేశమైన సందర్భంలో అన్వర్ ఇబ్రహీం చేసిన పోస్ట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ ఫొటోకు 1957లో వచ్చిన ‘నయా దౌర్’ సినిమాలోని ‘సాథీ హాత్ బఢానా’ పాటను ఎంచుకున్నారు. కలిసికట్టుగా చేతులు కలిపి ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ పాట అందిస్తుంది. దీంతో ఇరాన్‌ ప్రతినిధులతో భేటీకి ఈ పాటను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి దిగిన ఫొటోకూ అన్వర్ ఇబ్రహీం ఓ బాలీవుడ్ పాటను జత చేశారు. అమీర్ ఖాన్ నటించిన 2001 చిత్రం ‘లగాన్’లోని ‘చలే చలో’ పాటను ఎంచుకున్నారు. కలిసి ముందుకు సాగాలనే భావాన్ని ప్రతిబింబించే ఈ పాట.. పుతిన్‌తో భేటీకి ప్రత్యేక అర్థాన్ని తీసుకొచ్చింది.


అయితే బాలీవుడ్ సంగీతాన్ని దౌత్య సందేశాలకు ఉపయోగించుకున్న నేత అన్వర్ ఇబ్రహీం ఒక్కరే కాదు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో కూడా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో.. భారత్ పర్యటన సందర్భంగా ‘దిల్ ధడక్‌నే దో’ సినిమాలోని బాలీవుడ్ సంగీతాన్ని ఉపయోగించారు. దీంతో బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా రాజకీయాలు, దౌత్యానికి తోడు బాలీవుడ్ పాటలూ సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారితీశాయి.


కాగా, ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాల నుంచి 11 బృందాలు వచ్చాయి. అలాగే భాగస్వామ్య దేశాల నుంచి 10, ప్రాంతీయ సంస్థల నుంచి నాలుగు, అంతర్జాతీయ సంస్థల నుంచి ఏడు సహా మొత్తం 32 ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్‌తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్

రూ.24 లక్షల ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తరానా చౌహాన్ సాహసం!

Updated Date - Sep 15 , 2026 | 09:53 AM