ఇరాన్‌తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:53 AM
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చమురు ధరలు ప్రస్తుతం అమెరికాలో ఇతర ఉత్పత్తుల ధరలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయని, ఇరాన్ వివాదం కారణంగానే క్రూడ్ ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. 'ఇరాన్‌తో సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధర రాయి లాగా కిందకు పడిపోతుంది' అని ట్రంప్ తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా వెల్లడించారు (Donald Trump oil prices).
కాగా, మంగళవారం కూడా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.18 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.93 డాలర్లకు చేరాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరా మరియు రవాణాకు సంబంధించిన అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికాలో ధరలు భారీగా తగ్గుతున్నాయని, చమురు మాత్రం దీనికి మినహాయింపుగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు (Crude oil prices Iran war).
అమెరికాలో ధరల పెరుగుదలకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ విధానాలే కారణమని ట్రంప్ మరోసారి ఆరోపించారు (Trump oil statement). బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చమురు ధరలు ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువగా ఉండేవని కూడా ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో యుద్ధం ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం కుదురుతుంది, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఎలా సాధారణమవుతాయి వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..