కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్
ABN , Publish Date - Jun 14 , 2026 | 06:40 PM
తన కుమార్తె అదితి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.
లక్నో: తన కుమార్తె అదితి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav) మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.
అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం యూపీలో రాజకీయ చర్చకు దారితీసింది. రాజకీయ నేతల కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వ్యక్తిగత దాడులకు పాల్పడుతుండటాన్ని పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ఖండిచారు. దీనిపై డింపుల్ యాదవ్ మాట్లాడుతూ, ఇది బీజేపీ మద్దతుదారల పనేనని ఆరోపించారు. అయోధ్య రామాలయానికి సమర్పించిన కానుకల దొంగతనం జరిగినట్టు వచ్చిన ఆరోపణలను దారి మళ్లించేందుకే బీజేపీ చేస్తున్న ప్రయత్నమిదని అన్నారు. అయితే తాము మాత్రం ఈ ఆరోపణలను తప్పదారి పట్టించేందుకు అనుమతించేది లేదని చెప్పారు.
సీరియస్ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాలను బీజేపీ సృష్టిస్తోందని డింపుల్ యాదవ్ అన్నారు. 'ప్రజల దృష్టి మళ్లించడమే ఈ ప్రభుత్వం పని. హథ్రోస్‌లో మన ఆడకూతుళ్లు తగులబడుతుంటే వీళ్లు ముందుకు రాలేదు. కాన్పూర్‌లోని పోలీసు స్టేషన్‌లో ఒక యువతి తండ్రిని కొట్టి చంపినప్పడు వీళ్లలో ఒక్కరైనా మాట్లాడారా? యూపీలో పలు కీలక ఘటనలు జరిగినప్పుడు ఒక్క బీజేపీ నేత అయినా ముందుకు వచ్చారా?' అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ జరుపుతున్న ప్రయత్నాల పట్ల సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, లక్ష్యం దిశగా పురోగమించాలని, రాజ్యాంగాన్ని, దేశాన్ని పరిరక్షించే లక్ష్యంతో పనిచేయాలని కోరారు.
అదితి యాదవ్ వివాదం ఏమిటి?
అఖిలేష్-డింపుల్ దంపతుల కుమార్తె అయిన అదితి యాదవ్‌ను టార్గెట్ చేస్తూ పలు అభ్యంతరకరమైన పోస్టులు తాజాగా సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. ఇవి ఒక్కసారిగా వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా, ఈ ఘటనను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటించారు. ఆడకూతుళ్లు ప్రతి ఒక్కరికీ ఆడకూతుళ్లేనని, వారిని కించపరిస్తే సహించేది లేదని అన్నారు. అఖిలేష్ కుమార్తెపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం తన దృష్టికి రాగానే ఇందుకు బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం
మమతా బెనర్జీకి టీఎంసీ రెబల్ ఎంపీ కకోలి దస్తిదార్ తనయుడు లీగల్ నోటీసు