నవంబరు 1న ర్యాలీ వద్దు.. 10దాకా ఆగండి
ABN , Publish Date - Oct 25 , 2026 | 02:37 AM
ఇండియా కూటమి నవంబరు 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ దగ్గర నిర్వహించతలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలని ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) విజ్ఞప్తి చేసింది.
దీపావళి వేళ ఆందోళనలు చేస్తే 25వేల కోట్ల నష్టం
రాహుల్ గాంధీకి ఢిల్లీ వ్యాపారుల సంఘం లేఖ
న్యూఢిల్లీ, అక్టోబరు 24: ఇండియా కూటమి నవంబరు 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ దగ్గర నిర్వహించతలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలని ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) విజ్ఞప్తి చేసింది. నవంబరు 1 నుంచి దీపావళి సీజన్ కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని, ర్యాలీ నిర్వహిస్తే రూ.25వేల కోట్ల మేర వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే దీపావళి సీజన్ ముగిశాక, నవంబరు 10వ తేదీ తర్వాత ర్యాలీ నిర్వహించుకోవాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి శనివారం లేఖ రాసింది. దంతేరాస్ నవంబరు 6న, దీపావళి నవంబరు 8న, భయ్యా దూజ్ నవంబరు 10న ఉన్నాయని లేఖలో గుర్తు చేసింది. ఇప్పటికే అక్టోబరులో నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ వ్యాపారులు రూ.3వేల కోట్ల మేర నష్టపోయినట్లు సీటీఐ తన లేఖలో పేర్కొంది. వోట్ చోరీ ఆరోపణలు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఇండియా కూటమి నవంబరు 1న ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించనుంది. దీనికి 10లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ర్యాలీ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన పార్టీ అగ్రనేతలు శనివారం ఈ సన్నాహాక చర్యలను పర్యవేక్షించారు. ఢిల్లీకి సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి తమ తమ పరిధుల్లోని పార్టీ కార్యకర్తలను సమీకరించి, ఢిల్లీకి తీసుకొచ్చేలా బాధ్యతలను అప్పజెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జ్ఞానేశ్‌పై మాక్ అభిశంసన చేపట్టేందుకు ఈ నెల 28న మాక్ పార్లమెంట్ నిర్వహించాలని ఇండియా కూటమి యోచిస్తోంది
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష