Share News

ఢిల్లీ పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు.. పోలీసుల ముమ్మర తనిఖీలు..

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:42 PM

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. శుక్రవారం మయూర్ విహార్ ఫేజ్-1లోని బలరామ్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర భద్రతా బృందాలు పాఠశాల వద్దకు చేరుకున్నాయి.

ఢిల్లీ పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు.. పోలీసుల ముమ్మర తనిఖీలు..
Delhi School Bomb Threat

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇవాళ (శుక్రవారం) మయూర్ విహార్ ఫేజ్-1లోని బలరామ్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర భద్రతా బృందాలు పాఠశాల వద్దకు చేరుకున్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారుల ప్రకారం.. ఉదయం 8.40 గంటలకు పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే భద్రతా బృందాలు పాఠశాలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, కారిడార్లు, ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


ఇదిలా ఉండగా, ఈ వారంలోనే ఢిల్లీలోని పలు ప్రముఖ పాఠశాలలకూ బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. చాణక్యపురిలోని బ్రిటిష్ స్కూల్, ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధీ ఎస్టేట్‌లోని సర్దార్ పటేల్ విద్యాలయం, ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్, కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌కు బెదిరింపు ఈ-మెయిళ్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఈ-మెయిళ్లన్నీ పంజాబీ భాషలో ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. పాఠశాలలతో పాటు పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు, కోర్టు సముదాయాల వద్ద పేలుళ్లు జరుగుతాయని దుండగులు హెచ్చరించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 29 వరకు ఢిల్లీ మెట్రో, రైళ్లలో ప్రయాణించవద్దనీ ఈ-మెయిళ్లలో ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.


అయితే, బెదిరింపులు వచ్చిన ప్రతి ప్రాంతానికీ భద్రతా బృందాలు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆయా పాఠశాలలు, కార్యాలయాల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం బలరామ్ పబ్లిక్ స్కూల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం అధికారులు మరిన్ని కీలక వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, కోచ్‌ అశోక్‌ మిశ్రాకు షాకింగ్ అనుభవం..

పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..

Updated Date - Sep 18 , 2026 | 01:49 PM