Share News

Delhi Police: పోలీసులు, బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య కాల్పులు..

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:22 PM

బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు, లారెన్స్ ముఠాకు చెందిన వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిందితుడి కాలికి గాయమైంది. కాల్పుల అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Delhi Police: పోలీసులు, బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య కాల్పులు..
Delhi Police Encounter

జాతీయం, జనవరి 15: బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులు, లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు మధ్య ఎదురు కాల్పులు(Delhi Police encounter) జరిగాయి. అనంతరం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నిందితుల్లో ఒకరి కాలికి బులెట్ గాయమైంది. మరో నిందితుడు మైనర్ గా తెలుస్తోంది. ఈ ఇద్దరు షూటర్లు ఢిల్లీలోని పశ్చిమ విహార్, వినోద్ నగర్ ప్రాంతాలలో జరిగిన కాల్పుల ఘటనలో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ఢిల్లీ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. 'నార్త్ డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ ఆధ్వర్యంలోని పోలీసులు, లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ కు మధ్య బుధవారం అర్ధరాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్టు చేశాం. నిందితులు పశ్చిమ విహార్, పశ్చిమ వినోద్ నగర్లలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఒక నేరస్థుడి కాలుకు బుల్లెట్ తాకడంతో గాయపడ్డాడు. అలానే ఓ పోలీసు కానిస్టేబుల్‌కూ గాయాలయ్యాయి. కానీ అతని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండటంతో ప్రాణాలకు ముప్పు తప్పింది. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నాము' అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.


గత సోమవారం (జనవరి 11) ఢిల్లీలోని పశ్చిమ వినోద్ నగర్‌(Vinod Nagar shooting)లోని ఆర్కే జిమ్‌పై, అలాగే పశ్చిమ విహార్ నగర్ లోని ఓ వ్యాపారవేత్త ఇంటి బయట షూటర్లు కాల్పులు జరిపారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పులు గంట వ్యవధిలో జరిగాయని.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే దీనికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Jan 15 , 2026 | 01:13 PM