Share News

Puttaparthi: చిత్రావతిలో.. ఉచితంగా తోడేస్తున్నారు!

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:05 PM

చిత్రావతి నది నుంచి ఇసుకను పెద్దఎత్తున తోడేస్తున్నా.. సంబంధిత అధికారులు సట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.

Puttaparthi: చిత్రావతిలో.. ఉచితంగా తోడేస్తున్నారు!

- యథేచ్ఛగా ఇసుక దోపిడీ

- గుళ్లవుతున్న వాగులు, వంకలు, నదులు

- బోరుబావులు ఎండిపోతాయని రైతుల ఆందోళన

- అడ్డుకుంటే దౌర్జన్యం చేస్తున్న ఇసుకాసురులు

- నిమ్మకు నీరెత్తినట్లుగా అధికార యంత్రాంగం

పుట్టపర్తి(అనంతపురం): ఉచితం మాటున వ్యాపారులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తూ, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సామాన్యులు తమ నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదని వాపోతున్నారు.


ఖాళీ అవుతున్న చిత్రావతి

జిల్లాలో ఇసుక అవసరాలు తీరుస్తున్న వనరుల్లో చిత్రావతి నది ఒకటి. జిల్లాలో ఈ నది దాదాపు 100 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఈ నది, పరిసర ప్రాంతాలు ఇసుక వ్యాపారులకు కల్పతరువుగా మారాయి. కొందరు రాత్రిపూట ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను నది నుంచి తోడి తమకనుకూలమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత డంపు చేసిన ఇసుకను మరోచోటుకు రవాణా చేస్తున్నారు. ఆదాయం బాగుండటంతో వ్యాపారులు నదిలో ఇసుక మేట కనపడితే చాలు తోడేస్తున్నారు. దీంతో నదీలో ఇసుక ఖాళీ అవుతోంది. ఈక్రమంలో ఎటుచూసినా గుండ్లు, రాళ్లు దర్శనమిస్తున్నాయి.


చోద్యం చూస్తున్న అధికారులు

ఇసుకను సొంత అవసరాలకు తప్ప వ్యాపార నిమిత్తం తరలించరాదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే గృహాల నిర్మాణానికి ఇసుక తోలుతున్నామంటూ ట్రాక్టర్లో నింపుకుని తమ సొంత స్థలాల్లో డంపు చేస్తున్నారు. గృహ నిర్మాణాలకు కాస్త తోలి మిగిలిన వందల ట్రాక్టర్లను రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


pandu3.2.jpg

ఇసుకను తోడేస్తే నదిని ఆనుకుని ఉన్న తమ భూములు కోతకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవిస్తున్నా ప్రయోజనం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలాల కింద ఇసుక తీయవద్దని వ్యాపారులను ఎవరైనా అడ్డుకుంటే ‘నదిలో ఇసుక తవ్వుతున్నాం. ఇందులో మీకేం సంబంధం అంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఎనుములపల్లి, రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి రైతులు వాపోతున్నారు. ఇలా ఇసుకను తవ్వేస్తే పొలాల్లోని బోరుబావులు సైతం ఎండిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని ఇసుక అక్రమాలను కట్టడి చేయాలంటూ కోరుతున్నారు.


మాఫియాగా మారి..

అమడగూరు, ఓడీ చెరువు మండలాల్లో మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తూ ట్రాక్టర్‌కు రూ.మూడు వేలు వసూలు చేస్తున్నారు. వాగులు, వంకలు, ఏరుల్లో నుంచి ఇసుకను యంత్రాల సాయంతో తోడి రహస్య ప్రాంతాల్లో డంపు చేస్తున్నారు. తర్వాత రాత్రిపూట రాష్ట్రం దాటించి వేలు లక్షల రూపాయలు గడిస్తున్నారు. మహమ్మదాబాదు క్రాస్‌లో దాదాపు 25 ట్రాక్టర్లు పెట్టుకొని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇసుక మాఫియాగా మారారని చుట్టుపక్కల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇష్టారాజ్యంగా ఇసుక తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రామనాథరెడ్డి పేర్కొన్నారు.


చర్యలు తప్పవు

సొంత అసవరాలకు మాత్రమే నదుల నుంచి ఇసుకను తీసుకెళ్లవచ్చు. అలాకాకుండా ఎవరైన ఇసుకతో వ్యాపారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు సొంత అవసరానికి నదుల నుంచి ఇసుక తీసుకుళ్లేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. యంత్రాలు ఉపయోగించి నదుల్లో ఇసుక తోడినా, ఇసుకతో వ్యాపారం చేసినా వారిపైన చట్టపరంగా చర్యలు ఉంటాయి.

-అమీర్‌బాషా, ఏడీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ, పుట్టపర్తి


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 12:07 PM