రామ్‌లీలా మైదానంలో 50 వేల మందికే అనుమతి.. ఢిల్లీ పోలీసుల కొత్త రూల్స్..!
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:19 PM
ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే నిరసనలు, ప్రదర్శనలు, బహిరంగ సమావేశాల నియంత్రణకు ఢిల్లీ పోలీసులు విధివిధానాలు రూపొందించారు. దీని ప్రకారం.. రామ్‌లీలా మైదాన్‌లో 50 వేల మందికి మించి గుమిగూడేందుకు అనుమతి ఉండదు. అలాగే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిరసనలకు అనుమతి ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 14: ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం ఇటీవల వరుస నిరసనలతో అట్టుడికింది. ఓట్ చోరీ, నీట్ యూజీ పరీక్ష అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసనలు, ప్రదర్శనలకు అనుమతించే ప్రాంతాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్లను నిర్ణయించారు.
ఈ సందర్భంగా రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాల నియంత్రణకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని ఢిల్లీ పోలీసులు రూపొందించారు. ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. రామ్‌లీలా మైదాన్‌లో 50 వేల మందికి మించి గుమిగూడేందుకు అనుమతి ఉండదు. అయితే, నిరసనల్లో పాల్గొనే వారి సంఖ్యను కార్యక్రమ స్వభావం, జనసమూహ పరిమాణం, అందుబాటులో ఉన్న భద్రతా ఏర్పాట్ల ఆధారంగా సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిరసనలకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా, కార్యక్రమ నిర్వాహకులు పోలీసుల అనుమతి కోరే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును సాధారణంగా ప్రతిపాదిత కార్యక్రమానికి కనీసం 10 రోజుల ముందుగా సమర్పించాలి.
మరోవైపు, వేదిక వద్ద తుపాకులు, కత్తులు, ఈటెలు, పదునైన వస్తువులు, ఇతర నిషేధిత వస్తువుల అనుమతి నిరాకరించనున్నారు. రామ్‌లీలా గ్రౌండ్ పరిసరాల్లో డ్రోన్ల వినియోగానికీ ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ అధికారులతో సమన్వయం చేసుకోవడంతో పాటు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యతా నిర్వాహకులదే. అలాగే, రోడ్లు, అత్యవసర ప్రవేశ మార్గాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమ నిర్వాహకులు తాగునీరు, వైద్య సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ వంటివి చేయాల్సి ఉంటుంది. కాగా, ముసాయిదా మార్గదర్శకాలను ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, నియమ నిబంధనలను ఇంకా ఖరారు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధానితో నా బంధం రాజకీయాలకు అతీతమైంది: సామ్ పిట్రోడా
నగ్న ఫొటోలు పంపిన పాక్ యువతి.. ఐఏఎఫ్ రహస్యాలు లీక్..!