నగ్న ఫొటోకు ఐఏఎఫ్ రహస్యాలు లీక్.. పాక్ గూఢచారితో వింగ్ కమాండర్ చాటింగ్..!
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:56 AM
భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ హనీట్రాప్‌కు గురయ్యారు. యువతి పంపిన నగ్న ఫొటోకు ప్రతిగా ఐఏఎఫ్‌కు చెందిన రహస్య సమాచారాన్ని ఆయన పాక్‌కు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. వింగ్ కమాండర్‌ను అరెస్టు చేసి కస్టడీకి పంపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ వింగ్ కమాండర్ హనీట్రాప్‌కు గురయ్యారు. యువతి పంపిన నగ్న ఫొటోకు ప్రతిగా ఐఏఎఫ్‌కు చెందిన రహస్య సమాచారాన్ని ఆయన పాక్‌కు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పాకిస్థానీ గూఢచార సంస్థతో సంబంధాలున్న ఏజెంట్‌కు అత్యంత సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారంటూ ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐదు నెలల క్రితం వింగ్ కమాండర్‌ను అరెస్టు చేసి కస్టడీకి పంపగా తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఐఏఎఫ్ రహస్య యుద్ధ ప్రణాళికలు, డ్రోన్ యూనిట్ల సామర్థ్యాలు, యుద్ధ విమానాల మోహరింపు, సైనిక విన్యాసాలు, కీలక సైనిక స్థావరాలకు సంబంధించిన వివరాలను పాకిస్థానీ గూఢచారితో వింగ్ కమాండర్ పంచుకున్నట్లు ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆయన వాట్సాప్ ద్వారా యువతితో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే రహస్య సైనిక సమాచారాన్ని ఆమెకు చేరవేశారని తెలిపారు. ఏప్రిల్ 1న కార్యాలయంలోకి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకెళ్తుండగా భద్రతా సిబ్బంది ఆయనను తనిఖీ చేశారని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో పాక్ గూఢచారి ఆయనకు ఓ నగ్న ఫొటో పంపినట్లు గుర్తించారని తెలిపారు. ఇందుకు ప్రతిగా వింగ్ కమాండర్ ఐఏఎఫ్‌కు చెందిన రహస్య యుద్ధ ప్రణాళికలోని ఓ పేజీని పంపినట్లు పోలీసులు ఆరోపించారు.
అంతేకాకుండా తన ఆధీనంలో పనిచేస్తున్న ఐదుగురు అధికారుల ఎలక్ట్రానిక్ పరికరాల్లో మాల్‌వేర్, స్పైవేర్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు కూడా వింగ్ కమాండర్ సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వింగ్ కమాండర్, పాక్ గూఢచారి మధ్య జరిగిన వాట్సాప్ డేటాను పరిశీలించగా.. 3,008 టెక్స్ట్ మెసేజ్‌లు, 65 ఫొటోలు, 65 రియాక్షన్లు, 42 వాయిస్ కాల్స్, నాలుగు వీడియో కాల్స్, ఆరు యూఆర్‌ఎల్‌లు మార్పిడి జరిగినట్లు గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటన దేశ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించడంతో పాటు ఐఏఎఫ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీ ఫిలిప్పీన్స్ టూర్ ఖరారు.. రెండు కీలక సదస్సులకు హాజరుకానున్న ప్రధాని
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, 20 మందికి తీవ్ర గాయాలు..