Share News

రూ.1.10 లక్షల కోట్ల రక్షణ పరికరాల కొనుగోలుకు DAC ఆమోదం

ABN , Publish Date - Sep 07 , 2026 | 09:05 PM

భారత రక్షణ దళాల ఆధునీకరణ కోసం, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1.10 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది.

రూ.1.10 లక్షల కోట్ల రక్షణ పరికరాల కొనుగోలుకు DAC ఆమోదం
DAC Clears Rs 1.10 Lakh Crore Defence Acquisition Proposals

ఢిల్లీ, సెప్టెంబర్ 7: భారత రక్షణ దళాల ఆధునీకరణను వేగవంతం చేయడంతో పాటు దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి మరింత ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం దాదాపు రూ. 1.10 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, విడిభాగాలు, రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) సూత్రప్రాయ ఆమోదం (Acceptance of Necessity - AoN) తెలిపింది.


రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఇవాళ (సోమవారం) జరిగిన సమావేశంలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేశారు. మొత్తం ఆమోదించిన నిధుల్లో ఏకంగా 98 శాతం నిధులను భారతీయ పరిశ్రమల (Indian Industry) నుంచే కొనుగోలు చేయడానికి కేటాయించడం విశేషం.


కొనుగోలు ఆమోదాల వివరాలు

1. ఇండియన్ ఆర్మీ

సీబీఆర్ఎన్ (CBRN) రెక్కి వాహనాలు: రసాయన, జీవ, రేడియోలాజికల్, అణు ప్రమాదాలను గుర్తించి పరిశీలించే వాహనాలు.

హై మోబిలిటీ వాహనాలు: క్లిష్టమైన సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, లాజిస్టిక్స్ వేగవంతం చేయడానికి.

ఇతర పరికరాలు: సెల్ఫ్ ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్లు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు (ALH), ట్రాల్ ట్యాంకులు, 'సర్వత్ర' బ్రిడ్జ్ సిస్టమ్స్.

2. ఇండియన్ నేవీ

అరుద్ర రాడార్లు (Arudhra Radars): నావల్ ఎయిర్ స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న పాత ఎయిర్-రూట్ సర్వైలెన్స్ రాడార్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేస్తారు.

మెరైన్ గ్యాస్ టర్బైన్లు (MGT): యుద్ధనౌకల ఇంజన్ వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు స్వదేశీ మెరైన్ గ్యాస్ టర్బైన్ల డిజైన్, అభివృద్ధి, కొనుగోలు.

3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్

యుద్ధ సామర్థ్యం పెంపు: ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల యుద్ధ సామర్థ్యాన్ని పెంచే పరికరాల కొనుగోలు.

ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్: గ్రౌండ్ బేస్డ్ మల్టీ-పర్ఫస్ జామర్లు, 'డిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూర్ యాక్సెస్ కార్డ్' సిస్టమ్స్ ఇన్స్టలేషన్.

స్వదేశీ రక్షణ రంగానికి కొండంత మద్దతు

విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించి, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా 98 శాతం ఆర్డర్లను దేశీయ పరిశ్రమలకే కట్టబెట్టడం ద్వారా భారతీయ డిఫెన్స్ తయారీ వ్యవస్థ (Defence Manufacturing Ecosystem) కొత్త పుంతలు తొక్కుతుందని, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Updated Date - Sep 07 , 2026 | 09:28 PM