Share News

అధికారం అంత ఈజీగా రాదు.. డీకే సోదరుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:55 PM

పార్టీ పట్ల మొదటి నుంచీ క్రమశిక్షణ కలిగిన సైనికుడు గానే తన సోదరుడు ఉన్నారని డీకే శివకుమార్ అభివర్ణించారు. ఇటు పార్టీ ప్రయోజనాలు, అటు శాసనసభ్యుల ప్రయోజనాలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పారు..

అధికారం అంత ఈజీగా రాదు.. డీకే సోదరుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
DK Shivakumar and DK Suresh

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ (DK Suresh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం కోసం డీకే శివకుమార్ ఎంతో ఓర్పుతో ఉన్నారని చెప్పారు. మంగళవారం ఆయన మీడియా మాట్లాడుతూ, పార్టీ పట్ల మొదట్నించీ క్రమశిక్షణ కలిగిన సైనికుడుగానే తన సోదరుడు ఉన్నారని చెప్పారు. ఇటు పార్టీ ప్రయోజనాలు, అటు శాసనసభ్యుల ప్రయోజనాలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ సైతం ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిపారు.


'ఓర్పుతో ఉండాలని పార్టీ ఇప్పటికే డీకేను కోరింది. మైసూరులో ఇద్దరూ కలిసినప్పుడు కూడా సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటామని రాహుల్ చెప్పారు' అని సురేశ్ తెలిపారు. ఎంతకాలం ఓర్పుగా ఉండాల్సి వస్తుందని మీడియా అడిగినప్పుడు... అధికారం ఎవరికీ అంత సులభం కాదని, ఓర్పు లేకుండా అది సాధించలేమని చెప్పారు. తన సోదరుడి నుదుటిపై రాసిపెట్టి ఉంటే ఆయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతాడని సమాధానమిచ్చారు. శివకుమార్ మద్దతుదారులు ఎంతకాలం వేచిచూడాల్సి ఉంటుందని అడిగినప్పుడు, ఈ నెల 22 నుంచి 31 వరకూ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, ఆ తర్వాత అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంటుందని సమాధానమిచ్చారు.


కాలమే సమాధానం చెబుతుంది..

కాగా, శివకుమార్ సైతం ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలమే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతుందన్నారు. తనకు సీఎం సిద్ధరామయ్యతో సహా 140 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం

నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ

Read Latest National News

Updated Date - Jan 20 , 2026 | 09:12 PM