కౌంటింగ్ డే.. అందరి దృష్టి ఫలితాలపైనే
ABN , Publish Date - May 03 , 2026 | 09:52 PM
ఇండియా రాజకీయ ముఖచిత్రం తిరగరాసే ఎన్నికలుగా మే 4వ తేదీ నిలువనుందా అనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
న్యూఢిల్లీ: ఇండియా రాజకీయ ముఖచిత్రం తిరగరాసే ఎన్నికలుగా మే 4వ తేదీ నిలువనుందా అనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని బీజేపీ, విపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు అత్యంత కీలకం కానున్నాయి.
పశ్చిమబెంగాల్‌లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగులుతుందని, బీజేపీని విజయం వరించనునుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీఎంసీ కొట్టివేసింది. నాలుగోసారి కూడా తామే అధికారంలోకి వస్తాయమని ధీమా వ్యక్తంచేస్తోంది. టీఎంసీకి ఈ విజయం చాలా కీలకం కానుంది. మమతాబెనర్జీ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలన్నా, 2029 లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి'కి నేతృత్వం వహించే అవకాశాలు మెరుగుపరచుకోవాలన్నా బెంగాల్‌లో టీఎంసీ గెలుపు అనివార్యం. బెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో మొత్తం 294 నియోజకవర్గాలకు గాను 293 నియోజకవర్గాల్లో సోమవారం కౌటింగ్ జరుగుతుంది.
తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 'మునక' ఖాయమని, విజయ్ సారథ్యంలోని టీవీంకే గట్టి ఫలితాలను సాధించబోతోందని జోస్యం చెప్పాయి. టీఎంకే 20 శాతం ఓట్లు సాధించినా రాజకీయ పునరేకీకరణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.
కేరళలో ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్, పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్‌కు గెలుపు చాలా కీలకంగా ఉంది. కేరళలో పదేళ్లుగా అధికారానికి నోచుకుని కాంగ్రెస్ ఈసారి గెలుపుపై ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ సైతం యూడీఎఫ్ గెలుస్తుందని అంచనా వేశాయి. లెఫ్ట్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళ కావడంతో ఎల్డీఎఫ్‌కు కూడా గెలుపు కీలకంగా మారింది.
అస్సాంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడింట రెండు వంతుల మెజారిటీని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే గెలుచుకుంటుందని చెప్పాయి.
పుదుచ్చేరిలో మార్పేమీ ఉండదని, ఏఐఎన్ఆర్‌సీ సారథ్యంలోని ఎన్డీయే తిరిగి అధికారం నిలబెట్టుకుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే తమిళనాడు తరహాలోనే పుదుచ్చేరిలోనూ తమ కూటమి ఆధిపత్యం సాధిస్తుందని కాంగ్రెస్-డీఎంకే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ