ఢిల్లీలో 20 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం.. డీకే హెచ్చరిక
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:25 PM
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకుని లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వీరంతా కర్ణాటక భవన్‌లో మకాం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకుని లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వీరంతా కర్ణాటక భవన్‌లో మకాం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో మకాం చేసిన ఎమ్మెల్యేలలో టీబీ జయచంద్ర, అశోక్ పట్టాన్, హంపెగౌడ బాదర్లి, పుట్టరంగ షెట్టి, వినయ్ కులకర్ణి, పుట్టస్వామి, బేలూర్ గోపాలకృష్ణ, జీఎస్ పాటిల్, జేడీ పాటిల్, ఏఆర్ కృష్ణమూర్తి, షడక్షరి, నారాయణస్వమి, రాజశేఖర్ పాటిల్ హత్నాల్, బి.శివన్న తదితరులు ఉన్నారు.
కర్ణాటకలో కీలక మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్‌లో 34 మంది మంత్రులు ఉండగా, పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పలువురు ఎమ్మెల్యేలను మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి చోటు కల్పించాలని అధిష్టానం ఆలోచనగా ఉంది. భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా మంత్రివర్గ పునర్వవస్థీకరణకు పార్టీ వ్యూహరచన జరుపుతోందని, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడైన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని అంతర్గత వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యేలకు డీకే హెచ్చరిక
తాజా పరిణామాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, ఢిల్లీలో పలువురు ఎమ్మెల్యేలు మకాం వేశారని, ఈ అంశంపై ముఖ్యమంత్రి కూడా మాట్లాడారని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని, పార్టీని గౌరవిస్తూ, పార్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. మీడియా ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయరాదని, ప్రతి ఒక్కరి భవిష్యత్తు పార్టీతోనే ముడిపడి ఉందని, మీడియాతో కాదని పేర్కొన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానాన్నిఎమ్మెల్యేలు కోరితే అందులో తప్పేమీ లేదని, అయితే మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయరాదని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని డీకే హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ
లాలూకు సుప్రీంలో చుక్కెదురు... వ్యక్తిగత హాజరు నుంచి మాత్రం మినహాయింపు