Share News

సనాతన ధర్మ నమ్మకంతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం: CM యోగి ఆదిత్యనాథ్

ABN , Publish Date - Jun 26 , 2026 | 01:24 PM

అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై యూపీ సీఎం యోగి ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అలాంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు.

సనాతన ధర్మ నమ్మకంతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం:  CM యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath Issues Stern Warning Over Ayodhya Ram Temple Donation Row

దేవరియా (ఉత్తర్ ప్రదేశ్), జూన్ 26: అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అటువంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

యూపీలోని దేవరియాలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మందిర విరాళాల వివాదంలో జరిగిన తాజా అరెస్టులను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మతపరమైన సెంటిమెంట్లతో, నమ్మకాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


'SIT' నివేదికతో రంగంలోకి పోలీసులు.. చర్యలు ప్రారంభం

ఈ విరాళాల దుర్వినియోగం వ్యవహారంపై వెల్లువెత్తిన ఆరోపణలను తేల్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిజా నిజాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజాగా SIT బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో, పోలీసులు పక్కా ఆధారాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన ఎనిమిది మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను పోలీసులు ప్రస్తుతం తమ ఆధీనంలోకి తీసుకుని, ఈ భారీ నిధుల మళ్లింపు వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు లోతుగా విచారిస్తున్నారు.


ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్

ఇంతకుముందు అయోధ్య పర్యటనలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని రాజకీయ రంగు పూసి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రామాలయ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ ఎవరి వద్దనైనా ఈ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే నేరుగా SIT కి సమర్పించవచ్చని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చరిత్రలో నిలిచిపోయేలా కఠిన శిక్షలు పడేలా చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఆలయ పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు

సైబర్‌ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 02:05 PM