Surat: పండగ పూట విషాదం.. ప్రాణాల తీసిన మాంజా..
ABN , Publish Date - Jan 15 , 2026 | 08:39 PM
సంక్రాంతి సంబరాల్లో కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. పతంగులు ఎగరేయడం ఒక భాగం. గత కొంత కాలంగా పతంగులు ఎగరేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, జంతువులే కాదు.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా మాంజా ఒక కుటుంబాన్ని బలితీసుకుంది.
గుజరాత్: సూరత్(Surat)లో పండగ పూట తీవ్ర విషాదం(tragedy) చోటు చేసుకుంది. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్) పై నుంచి రెహాన్ షేక్(35) అనే వ్యక్తి తన భార్య రెహానా, కూతురు ఆయిషా(7)తో కలిసి బైక్‌పై ఎంతో సంతోషంగా బయలుదేరారు. అంతలోనే రెహాన్ మెడకు గాలిపటం(Kite) మాంజా చుట్టుకోవడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెహాన్ అతని కూతురు ఆయోషా అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య రెహానా 70 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైఓవర్ (Flyover) కింద ఉన్న ఆటో రిక్షాపై పడింది.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ, దురదృష్టం వెంటాడింది.. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఈరోజు (గురువారం) రెహానా మృతి చెందింది. గుజరాత్(Gujarat)లోనే కాదు హైదరాబాద్, సంగారెడ్డి మండలంలో బిహార్‌కి చెందిన అద్వైక్ తన బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ఫ్లైఓవర్లపై ప్రయాణించేటపుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..