Share News

15 గంటల గాలింపు, 170 సీసీటీవీ కెమెరాల జల్లెడ.. కిడ్నాపర్ చెర నుంచి బాలుడిని కాపాడిన పోలీసులు

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:28 AM

అపహరణకు గురైన ఐదేళ్ల బాలుడిని కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాపర్ చెర నుంచి రక్షించారు. సినిమా తరహాలో వంద కిలోమీటర్లు చేజ్ చేసి కిడ్నాపర్‌ను అడ్డుకుని చిన్నారిని కాపాడారు. 170 సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టి, 15 గంటల తర్వాత బాలుడిని అతని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

15 గంటల గాలింపు, 170 సీసీటీవీ కెమెరాల జల్లెడ.. కిడ్నాపర్ చెర నుంచి బాలుడిని కాపాడిన పోలీసులు

ఇంటర్‌నెట్ డెస్క్: అపహరణకు గురైన ఐదేళ్ల బాలుడిని కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాపర్ చెర నుంచి రక్షించారు. సినిమా తరహాలో వంద కిలోమీటర్లు చేజ్ చేసి కిడ్నాపర్‌ను అడ్డుకుని చిన్నారిని కాపాడారు. 170 సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టి, 15 గంటల తర్వాత బాలుడిని అతని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని అర్మేలీ జిల్లా మోటా అంకాడియా గ్రామంలో బాలుడి కుటుంబం నివసిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కిడ్నాపర్ లలిత్ రూప్‌సింగ్ భాయ్ జమ్రే ఆరు నెలల క్రితం బాలుడి కుటుంబాన్ని ఒకసారి కలిసి వెళ్లాడు. మళ్లీ పది రోజుల క్రితం వచ్చి తనకు పని దొరికే వరకు ఎక్కడైనా ఆశ్రయం ఇవ్వాలని బాలుడి తండ్రి రాకేశ్ బమానియాను కోరాడు. రాకేశ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడే కావడంతో లలిత్‌ను నమ్మాడు. తన వ్యవసాయ క్షేత్రంలో అతడికి ఆశ్రయం ఇచ్చాడు. ఒకరోజు లలిత్.. రాకేశ్ కొడుకును బైక్‌పై ఎక్కించుకుని పోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వారికి రాకేశ్ దంపతులు సమాచారం ఇచ్చారు. తర్వాత అమ్రేలీ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు

కిడ్నాపర్ లలిత్‌ వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో అతడి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులకు సవాలుగా మారింది. అతను తీసుకెళ్లిన బండి రిజిస్ట్రేషన్ నంబర్, అతని పేరుమీద పోలీసులు గాలించారు. ఇందు కోసం ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అర్మేలీ, రాజ్‌కోట్, గాంధీ నగర్‌లోని త్రినేత్ర కంట్రోల్ రూంలను పోలీసులు ఎప్పటికపుడు సంప్రదిస్తూ గాలించారు. మొత్తం 170 సీసీటీవీ కెమెరాల లొకేషన్లను విశ్లేషించారు. రాజ్‌కోట్-పోర్ బందర్ నేషనల్ హైవే, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దుకాణాలు, కాంప్లెక్సులు ఇలా ప్రతీచోటా వెతికారు. చివరకు రాజ్‌కోట్‌లోని గోండల్‌ వైపు కిడ్నాపర్ వెళ్లినట్లు గుర్తించారు. అలాగే రాజ్‌కోట్‌లోని విపురలో గెస్ట్ హౌసులు, దుకాణాలు, లోకల్ షెల్టర్లలోనూ జల్లెడ చేపట్టారు. చివరకు లలిత్‌ను అతను బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో అడ్డుకున్నారు. వెంటనే అతడి చెర నుంచి బాలుడిని తీసుకుని లలిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కాగా.. కిడ్నాపర్‌ను మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అయితే, బాలుడిని అతను ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం

పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం.. పోలీసులమని బెదిరిస్తూ..

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..

Updated Date - Sep 22 , 2026 | 08:28 AM