పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం.. పోలీసులమని బెదిరిస్తూ..
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:08 AM
దేశంలో బాలికలపై అత్యాచారాలు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, బిహార్‌లో చిన్నారులపై వరుస లైంగిక దాడులు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఓ పార్కులో దుండగులు పోలీస్ వేషధారణలో బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.
ఢిల్లీ: దేశంలో బాలికలపై అత్యాచారాలు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, బిహార్‌లో చిన్నారులపై వరుస లైంగిక దాడులు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల దేశ రాజధానిలో ఓ బాలికపై సామూహిక హత్యాచారం జరగగా.. గత శనివారం నాడు బిహార్‌లోని జముయి జిల్లాలో 17 ఏళ్ల చిన్నారిని ఓ మూక లైంగికంగా వేధించింది. తాజాగా ఢిల్లీలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. పోలీస్ వేషధారణలో ఓ బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది.
ఢిల్లీలోని కల్కాజీ మందిరానికి ఓ బాలిక (17) తన స్నేహితుడితో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటలకు వెళ్లింది. అక్కడ ప్రార్థనల అనంతరం సమీపాన ఉన్న ఓ పార్కుకు వారిద్దరూ రాత్రి 7:30 గంటల సమయంలో వెళ్లారు. అయితే, బాలుడు, బాలిక సరదాగా పార్కులో తిరుగుతుండగా.. ఓ ముగ్గురు యువకులు వారి వద్దకు వెళ్లారు. పోలీసుల దుస్తులు ధరించిన నిందితులు.. తమను తాము పోలీసులమని చెప్పుకున్నారు. ఆ ఇద్దరినీ బెదిరించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది.
అయితే, ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కల్కాజీ మందిర్, ఇస్కాన్ టెంపుల్‌ను కలిపే పార్కులో అత్యాచారం జరిగిందని వారు తెలిపారు. రాత్రి 8:45 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని, ఆమె వాంగ్మూలం ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటనపై పోక్సో కేసు నమోదైందని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. పార్కు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాలికపై లైంగిక వేధింపులు.. కలకలం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు..
స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి ఇకలేరు