Share News

బాలికపై లైంగిక వేధింపులు.. కలకలం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 07:19 AM

బిహార్‌లోని జమయి జిల్లాలో బాలికపై వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

బాలికపై లైంగిక వేధింపులు.. కలకలం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు..
Bihar Minister Shrawan Kumar

పాట్నా: బిహార్‌లోని జమయి జిల్లాలో బాలికపై వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలిక కోచింగ్ క్లాసుల నుంచి తిరిగి వస్తుండగా ఓ మూక వారిని అడ్డుకుని తీవ్రంగా వేధించింది. బాలుడిపై దాడి చేసి, బాలికను లైంగికంగా వేధించడం పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.


ఈ ఘటనపై మంత్రి శ్రావణ్ కుమార్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ‘ఇలాంటి చెదురుమదురు సంఘటనలు జరుగుతాయన్న విషయాన్ని కాదనలేం. ప్రపంచంలో నేరాలు అంతం కాలేదు’ అని అన్నారు. అయితే, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జేడీయూ నాయకుడు ఉమేశ్ కుష్వాహా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వారి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అధికారంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించాయి. అయితే, దీనిపై మంత్రి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ‘కొన్నిసార్లు నోరు జారినప్పుడు అలాంటి వ్యాఖ్యలు బయటకు వస్తాయి, కానీ ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. గతంలో చర్యలు తీసుకున్నాం, భవిష్యత్తులోనూ తీసుకుంటాం’ అని తెలిపారు.


కాగా, సెప్టెంబర్ 19న రాత్రి జమయి-లఖిసరాయ్‌ రోడ్డు సమీపంలోని మద్వా పహాడ్‌ ప్రాంతంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులపై అల్లరి మూక దాడికి తెగబడింది. కోచింగ్ క్లాసుల నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ గుంపు వారిని అడ్డుకుని.. బాలికను అసభ్యకరంగా తాకుతూ లైంగికంగా వేధించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ఆరు, ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

రూ.2వేలకు పైబడిన యూపీఐ చెల్లింపులను అనుమతించబోం

స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి ఇకలేరు

Updated Date - Sep 22 , 2026 | 07:25 AM