విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:28 PM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌ను తీసుకొచ్చింది.
రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), జూలై 15: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేలా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ (బుధవారం) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, పలువురు మంత్రులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణం నుంచి 'భావనా దీదీ కీ సైన్స్ పాఠశాల' (Bhawna Didi Ki Science Pathshala) అనే మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సరికొత్త మొబైల్ సైన్స్ ల్యాబ్ విశేషాలు.. బస్సులోనే అత్యాధునిక ల్యాబ్!
'భావనా దీదీ కీ సైన్స్ పాఠశాల' అనేది వినూత్నంగా రూపొందించిన ఓ మొబైల్ బస్ ల్యాబ్. గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటి తరం సాంకేతికతలపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు ఈ అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
రోబోటిక్స్ (Robotics)
డ్రోన్ టెక్నాలజీ, ఏరో మోడలింగ్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)
కోడింగ్, 3D ప్రింటింగ్
ఈ ఉచిత మొబైల్ ల్యాబ్‌ను పండరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భావనా బోహ్రాకు చెందిన 'భావనా సమాజ్ సేవి సంస్థాన్' అనే ఎన్జీఓ (NGO) నిర్వహిస్తోంది.
5 రోజుల ప్రత్యేక క్యాంపులు
పాఠశాలల వారీగా ఒక ముందస్తు క్యాలెండర్‌ను రూపొందించి ఈ బస్సు ఆయా స్కూళ్లకు వెళ్తుంది. ముఖ్యంగా పండరియా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలకు చెందిన 11, 12వ తరగతి (ఇంటర్మీడియట్) విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ శిక్షణ సాగుతుంది.
ఒక పాఠశాలలో ఈ ల్యాబ్ వాహనం వరుసగా 5 రోజుల పాటు ఉంటుంది. ఈ ఐదు రోజుల్లో విద్యార్థులకు AI ఎలా పనిచేస్తుంది? డ్రోన్లు ఎలా ఎగురుతాయి? రోబోలను ఎలా తయారు చేస్తారు? వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీలు ఎలా జరుగుతాయి? వంటి ఆధునిక విజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా వివరిస్తారు. ఈ ప్రణాళిక ద్వారా ఏడాదికి దాదాపు 5,000 నుంచి 6,000 మంది విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని నిర్దేశించుకున్నారు.
నేటి యుగానికి ఎంతో అవసరం.. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి
ఈ మొబైల్ ల్యాబ్‌ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఎమ్మెల్యే భావనా బోహ్రాను అభినందించారు. 'ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలోకి అడుగుపెట్టింది. ఇటువంటి తరుణంలో విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడేలా ఈ మొబైల్ ల్యాబ్‌ను తీసుకురావడం అభినందనీయం. మిడిల్, హైస్కూల్, హయ్యర్ సెకండరీ పాఠశాలలకు ఈ బస్సు వెళ్లి పిల్లలకు ఆధునిక సాంకేతికతలను నేర్పించడం వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది'. అన్నారు.
అడవులతో కూడిన మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా ఆధునిక విజ్ఞానాన్ని చేరవేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే భావనా బోహ్రా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు విజయ్ శర్మ, అరుణ్ సావో తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చిన గాలులు.. వీడియో వైరల్
కెనడా అడవుల్లో కార్చిచ్చు కలకలం.. రైలును చుట్టుముట్టిన భయానక మంటలు