Share News

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:55 PM

చెన్నైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఏకంగా 71.24 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
Chennai heroin seizure

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్న వేళ తమిళనాడు రాజధాని చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టుబడటం సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అక్రమ రవాణా ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భగ్నం చేశారు. శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన సుమారు 71.24 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.710 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా పట్టుబడిన హెరాయిన్ నిల్వల్లో ఇది అత్యధిక పరిమాణాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన DRI అధికారులు అనుమానిత వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 69 ప్యాకెట్లలో అత్యంత రహస్యంగా తరలిస్తున్న హెరాయిన్ బయటపడింది. డ్రగ్స్‌ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేశారు.


చెన్నై టు శ్రీలంక.. తీరప్రాంత మార్గంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ప్లాన్ భగ్నం..

DRI అధికారుల ప్రాథమిక విచారణలో ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక పక్కా ప్రణాళికతో పనిచేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉన్నట్లు వెల్లడైంది. చెన్నైని ప్రధాన రవాణా కేంద్రంగా ఉపయోగించుకుంటూ.. అక్కడి నుంచి తిరుచిరాపల్లి మీదుగా తీరప్రాంత మార్గాల ద్వారా హెరాయిన్‌ను శ్రీలంకకు తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహం రచించినట్లు గుర్తించారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో సంబంధం ఉన్న ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన హెరాయిన్‌తో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం-1985 నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్

For More TG News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 07:55 PM