Share News

మీ ఆస్తులు ప్రకటిస్తారా... స్టాలిన్‌కు విజయ్ సవాల్

ABN , Publish Date - Feb 23 , 2026 | 08:36 PM

రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని విజయ్ సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ ఆస్తులు ప్రకటిస్తారా... స్టాలిన్‌కు విజయ్ సవాల్
TVK Chief Vijay

వేలూరు: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌పై తమిళగగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ (Vijay) విమర్శల దాడి పెంచారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


'ఆస్తులెలా వచ్చాయి? అదంతా మీ కష్టార్జితమేనా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడబెట్టినవా? ఆ వివరాలు బహిరంగంగా వెల్లడించగలరా' అని విజయ్ నిలదీశారు. అవినీతిపై తాను మాట్లాడితే అవినీతి శక్తులే తిరిగి తనపై బురద చల్లుతున్నాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు 'విజయ్, స్టాలిన్ మధ్య జరుగుతున్న యుద్ధం' అని అన్నారు. టీవీకే 'స్వచ్ఛమైన శక్తి' అని, డీఎంకే 'దుష్టశక్తి' మరోసారి విమర్శించారు.


మనం మిత్రులమా? ఎలా?

రాజకీయంగా తనకు శత్రువులెవరూ లేరని, అంతా మిత్రులేనని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విజయ్ ప్రశ్నలు సంధించారు. అందరూ మిత్రులే అయితే, తామిద్దరూ కూడా మిత్రులమే అయితే, కరూర్ (తొక్కిసలాట) ఘటనపై తనను ఎందుకు ఆయన నిందించారని ప్రశ్నించారు. టీవీకే ర్యాలీలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? మీరు చేయాల్సిందంతా చేసి కరూర్ ట్రాజెడీపై మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? అని విజయ్ నిలదీశారు. లంచాలు, అవినీతి, రాజకీయ ప్రయోజనాలను ఆశించే వాళ్లే స్టాలిన్‌కు నిజమైన మిత్రులను ఎద్దేవా చేశారు. తమిళనాడును 'సూపర్ స్టార్ రాష్ట్రం' చేస్తానంటూ ప్రజలకు ముఖ్యమంత్రి తప్పుడు హామీలిస్తున్నారని ఆరోపించారు. తాము తప్పుడు హామీలు ఇవ్వమని, నిలబెట్టుకునే హామీలు మాత్రమే ఇస్తామని చెప్పారు. తమిళనాడు ప్రజలకు, అవినీతి ప్రభుత్వాన్ని మధ్య జరుగనున్న యుద్ధంలో ప్రజలే విజయం సాధిస్తారని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు ఎస్ఐఆర్ తుది జాబితా విడుదల.. 74 లక్షల మంది ఓటర్ల తొలగింపు

కర్ణాటకలో కుమ్ములాట.. కేబినెట్ విస్తరణ కోసం 31 మంది ఎమ్మెల్యేలు రాహుల్‌కు లేఖ

Updated Date - Feb 23 , 2026 | 09:09 PM