Share News

సోనార్ బంగ్లా సాకారం.. బెంగాల్ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ

ABN , Publish Date - Feb 23 , 2026 | 06:25 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బంగారు బంగ్లా కలల సాకారానికి తాను భరోసా ఇస్తున్నానని అన్నారు.

సోనార్ బంగ్లా సాకారం.. బెంగాల్ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ
PM Modi

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ (Open Letter) రాశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొద్ది నెలరోజుల్లో బెంగాల్ భవితను నిర్ణయించే కీలక ఎన్నికలు జరుగనున్నాయని, భావితరాల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రజలు వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. బంగారు బంగ్లా (Sonar Bangla) కలల సాకారానికి తాను భరోసా ఇస్తున్నానని అన్నారు.


'జై మహాకాళి' అంటూ ప్రధాని తన లేఖను ప్రారంభించారు. 'మరి కొద్ది నెలల్లోనే బెంగాల్ భవిష్యత్తు నిర్ణయం కోబోతోంది. మీరు తీసుకునే తెలివైన నిర్ణయం పైనే భావితరాల భవిష్యత్తు, దిశానిర్దేశం ఆధారపడి ఉంటుంది. సోనార్ బంగ్లా కోసం యువకులు, పెద్దలు, మహిళలు కన్న కలలు కల్లలుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇవాళ ఉంది. వారి బాధలు నన్ను కలిచివేస్తున్నాయి. ఇందుకోసం హృదయపూర్వకంగా ఒక తీర్మానం చేసుకున్నాను. వికసత్ బంగ్లా సాధనకు నిర్ణయం తీసుకున్నాను' అని ఆ లేఖలో మోదీ పేర్కొన్నారు. గత 11 ఏళ్లుగా దేశ ప్రజల ఆశీస్సుల బలంతో ప్రజాసంక్షేమానికి, దేశ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం పాటుపడిందని, రైతుల సంక్షేమం నుంచి యవత కలల సాకారం, మహిళా సాధికారత వరకూ కృషి చేసిందని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల సాధించిన సానుకూల ఫలితాలను ఇవాళ ప్రజలు చూస్తున్నారని అన్నారు.


బెంగాల్ అభివృద్ధి విషయంలో మమతాబెనర్జీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని మోదీ ఆ లేఖలో విమర్శించారు. అయినప్పటికీ ప్రజాసంక్షేమానికి కట్టుబడి కేంద్రం ముందుకు వెళ్తోందన్నారు. 'జన్-ధన్ యోజన'తో పశ్చిమబెంగాల్‌లోని సుమారు 5 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు తెరిచామని, స్వచ్ఛభారత్ అభియాన్ కింద 85 లక్షల టాయిలెట్లను రాష్ట్రంలో నిర్మించామని చెప్పారు. చిన్న వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.2.82 లక్షల కోట్లు రుణాలిచ్చామని, 56 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు అటల్ పెన్షన్ యోజన కింద లబ్ధి చేకూర్చామని, ఉజ్వల్ యోజన కింద కోటికి పైగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. 'కిసాన్ సమ్మాన్ నిధి' ద్వారా 52 లక్షల మంది రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించామని వివరించారు.


'నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన గడ్డలో ఇవాళ అక్రమ చొరబాట్లు, మహిళలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రబీంద్రనాథ్ ఠాగూర్ కలలుకన్న సోనార్ బంగ్లా ప్రమాదంలో పడింది. ఇవాళ బెంగాల్‌ పూర్వ గౌరవాన్ని పునరుద్ధరించాలి. మార్పు అనివార్యం. బెంగాల్ అభివృద్ధి ప్రయాణంలో అంతా కలిసిరావాలి. 2026లో వికసిత్ వెస్ట్ బెంగాల్‌ కోసం ప్రతినబూనుదాం' అని మోదీ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు ఎస్ఐఆర్ తుది జాబితా విడుదల.. 74 లక్షల మంది ఓటర్ల తొలగింపు

రాహుల్ తప్పుకోవాలి.. మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Feb 23 , 2026 | 06:28 PM