పీఎన్‌జీ తిరస్కరిస్తే ఎల్‌పీజీ సరఫరా కట్: కేంద్రం
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:22 PM
దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆయా వినియోగదారులు ఆ కనెక్షన్‌కు మారాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా మారకపోతే ఎల్‌పీజీ కనెక్షన్‌ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించడం సహా గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్(పీఎన్‌జీ) సరఫరా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెంటనే దానికి మారాలని ఆయా వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. దేశంలో పీఎన్‌జీని ప్రోత్సహించే దిశగా ముందడుగు వేస్తున్న కేంద్రం.. ఈ మేరకు 3 నెలల గడువు నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది.
పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఎల్‌పీజీ సిలిండర్లను మౌలిక సదుపాయాలు లేని ఏరియాలకు మళ్లించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. పీఎన్‌జీకి మారడం వల్ల రీఫిల్ బుక్‌చేసే అవసరముండదు. దీంతోపాటు నిరంతర గ్యాస్ సరఫరా అందుబాటులో ఉంటుంది. అయితే.. పీఎన్‌జీ సరఫరాలో సాంకేతిక సమస్యలు, ఇంటికి పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడం అసాధ్యమైన సందర్భంలో మాత్రమే ఎల్‌పీజీ సరఫరా కొనసాగుతుంది. కానీ.. దానికి పీఎన్‌జీ గ్యాస్ కంపెనీ నుంచి నిరభ్యంతర పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తప్పనిసరి.
ఈ మేరకు పీఎన్‌జీ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు పలు చర్యలు చేపట్టింది కేంద్రం. పైప్డ్ గ్యాస్ లైన్‌కు నిర్ణీత గడువులోగా అధికారులు అనుమతులు మంజూరు చేయాలి. నిర్దేశించిన ఫీజుకంటే ఎక్కువ వసూలు చేయకూడదు. హౌసింగ్ సొసైటీలు లేదా భూయజమానులు కూడా పైపులైన్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదు. అలాంటి సందర్భాలేమైనా తలెత్తితే ఆ ప్రాంతానికి ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేయడం సహా సంబంధిత వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. వీటి అమలును పర్యవేక్షించడం సహా సమ్మతిని నిర్ధారించేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డ్(పీఎన్‌జీఆర్‌బీ) నోడల్ అథారిటీకి బాధ్యతలు అప్పగించింది.
ఇవీ చదవండి:
ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు.. అందులో ఏమున్నాయంటే?
యుద్ధంలో మేమే గెలిచాం.. సైనికపరంగా ఇరాన్‌ను అంతమొందించాం: ట్రంప్