Share News

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా.. కేంద్రం ఉక్కుపాదం!

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:02 PM

పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా.. కేంద్రం ఉక్కుపాదం!

ఢిల్లీ, జులై 24: NEET, JEE వంటి పోటీ పరీక్షల్లో వరుస పేపర్ లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024' చట్టానికి సవరణలు చేసేందుకు ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు, పేపర్ లీకేజీ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్రం, అక్రమాలకు పాల్పడేవారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను పొందుపరిచింది.

అంతేకాకుండా, ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేవలం కేసు నమోదు, దర్యాప్తు ప్రక్రియలకే పరిమితం కాకుండా, విచారణను ప్రారంభించిన 3 నెలల్లోనే తుది తీర్పు వెలువడేలా నూతన చట్టంలో స్పష్టమైన నిబంధనలను చేర్చింది.


ప్రస్తుతం ఉన్న చట్టం ఏం చెబుతోంది?

2024 జూన్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడితే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అదే గ్యాంగ్‌లు/వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా లీకేజీలకు పాల్పడితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఇప్పుడు ఈ శిక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.


ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలు:

సభలో విస్తృత చర్చ: ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పేపర్ లీకేజీలు, విద్యా సంస్కరణలపై సమగ్ర చర్చ జరుపుతామని హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం: నీట్ పేపర్ లీక్ ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

శాంతియుత నిరసనకారులపై కేసులు నమోదు చేయరు: శాంతియుతంగా ఆందోళన తెలిపిన విద్యార్థులు, యువతపై ఎలాంటి కేసులు పెట్టబోమని హామీ ఇచ్చారు.


సభలో విపక్షాల ఆందోళనలు, బయట విద్యార్థుల నిరసనల నడుమ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం ద్వారా విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Updated Date - Jul 24 , 2026 | 03:36 PM