అలర్ట్.. నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఆ మందులు నిషేధం..
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:25 PM
చిన్నారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్‌ఫెనిరమైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అనే రెండు రసాయనాలతో కూడిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయాలు, పంపిణీపై ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: చిన్నారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్‌ఫెనిరమైన్ మేలియేట్ (Chlorpheniramine Maleate), ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) అనే రెండు రసాయనాలతో కూడిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయాలు, పంపిణీపై ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఉపయోగించరాదని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్రం తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రెండు రసాయనాలు కలిగిన అన్ని రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇకపై ఈ మందుల తయారీదారులు ఔషధాల లేబుల్, ప్యాకేజీ ఇన్‌సర్ట్, ప్రచారాల్లో స్పష్టమైన హెచ్చరికలను ముద్రించాల్సి ఉంటుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ ఎఫ్‌డీసీ ఉపయోగించరాదని వినియోగదారులకు తెలియజేయడాన్ని తప్పనిసరి చేసింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) చేసిన సిఫారసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాంబినేషన్ మందుల వినియోగం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
కాగా, ఈ రెండు రసాయనాలతో కూడిన కొన్ని ఎఫ్‌డీసీలపై కేంద్రం గతంలోనే చర్యలు తీసుకుంది. 2025 ఏప్రిల్ 15న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నిర్దిష్ట కాంబినేషన్ మందులపై ఆంక్షలు విధిస్తూ.. నాలుగేళ్లలోపు పిల్లలకు వాటిని ఉపయోగించరాదనే హెచ్చరికను తప్పనిసరి చేసింది. అయితే, తాజాగా ఆ నిబంధనను ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని ఫార్ములేషన్లకు విస్తరించింది. ఈ నోటిఫికేషన్‌ను ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం 1940లోని సెక్షన్ 26A కింద జారీ చేశారు. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
2035లో తేజస్ ఎంకే-2 ఉపయోగపడకపోవచ్చు.. వైమానిక దళ మాజీ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈకేవైసీకి రేపే లాస్ట్ డేట్..