Share News

సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు 'మూడు భాషలు' తప్పనిసరి

ABN , Publish Date - May 16 , 2026 | 05:37 PM

కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా సీబీఎస్ఈ, విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.

సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు 'మూడు భాషలు' తప్పనిసరి
CBSE Makes Three-Language Policy Mandatory for Classes 9 & 10

న్యూఢిల్లీ, మే 16 : దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కూళ్లలో లాంగ్వేజ్ విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2026 జులై 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు 'మూడు భాషల విధానాన్ని(Three Language Formula)' తప్పనిసరి చేస్తూ సీబీఎస్‌ఈ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (NEP 2020), నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(NCF-SE 2023) సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) విడుదల చేసిన నూతన సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్‌లోనే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జులై నుంచి ఒక పరివర్తన ప్రక్రియ(Transitional Approach) ద్వారా దీనిని అమలు చేయనున్నారు.

కొత్త పాలసీలో ముఖ్యాంశాలు:

కచ్చితంగా రెండు భారతీయ భాషలు: కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు అభ్యసించే మూడు భాషల్లో(R1, R2, R3) కనీసం రెండు భాషలు కచ్చితంగా స్థానిక భారతీయ భాషలై ఉండాలి.

ఫారిన్ లాంగ్వేజ్ ఆప్షన్: ఒకవేళ విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్ వంటి విదేశీ భాషలను చదవాలనుకుంటే.. మిగిలిన రెండు భాషలు భారతీయ భాషలైనప్పుడు మాత్రమే దానికి అనుమతి ఉంటుంది. లేదా విదేశీ భాషను 4వ అదనపు భాషగానూ ఎంచుకోవచ్చు.

బోర్డు పరీక్షల నుంచి మినహాయింపు: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు గానూ ఈ నూతన విధానంలోని మూడో భాషకు(R3) 10వ తరగతిలో బోర్డు పరీక్ష ఉండదు. స్కూల్ స్థాయిలోనే ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా దీనికి మార్కులు లేదా గ్రేడులు ఇస్తారు. అయితే ఇందులో పాస్ కావడం మాత్రం తప్పనిసరి.

పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్‌పై గైడ్‌లైన్స్:

మిడిల్ స్టేజ్(మిడిల్ స్కూల్), సెకండరీ స్టేజ్ చదువుల మధ్య లాంగ్వేజ్ స్కిల్స్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ వంటి అంశాలలో 75 నుంచి 80 శాతం వరకు పోలికలు ఉంటాయని బోర్డు పేర్కొంది. అందువల్ల ప్రస్తుతానికి 9వ తరగతి విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 6వ తరగతి స్థాయి R3 పాఠ్య పుస్తకాలనే ఉపయోగించనున్నారు.


ఈ పుస్తకాలతో పాటు స్థానిక, రాష్ట్ర స్థాయి సాహిత్యానికి సంబంధించిన కథలు, కవితలను కూడా సిలబస్‌కు అదనంగా చేర్చాలని స్కూళ్లను ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను 2026 జూన్ 15 నాటికి సీబీఎస్‌ఈ విడుదల చేయనుంది. జులై 1లోపు 19 అధికారిక భారతీయ భాషలకు సంబంధించిన 6వ తరగతి R3 పాఠ్య పుస్తకాలను బోర్డు అందుబాటులోకి తీసుకురానుంది.

లాంగ్వేజ్ టీచర్ల కొరతకు తాత్కాలిక వెసులుబాటు:

తాజా నిర్ణయంతో భారతీయ భాషలను ప్రవేశపెట్టడం వల్ల స్కూళ్లలో అర్హులైన ఉపాధ్యాయుల కొరత ఏర్పడే అవకాశం ఉందని బోర్డు గుర్తించింది. దీని కోసం పాఠశాలలకు కొన్ని కీలకమైన మినహాయింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది.

సహోదయ క్లస్టర్స్(Sahodaya Clusters): ఒకే ప్రాంతంలో ఉన్న వేర్వేరు సీబీఎస్‌ఈ పాఠాశాలలు పరస్పరం టీచర్లను షేర్ చేసుకోవచ్చు(Inter-school resource sharing).

హైబ్రిడ్ టీచింగ్: డిజిటల్ లేదా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మిశ్రమ పద్ధతుల్లో క్లాసులు నిర్వహించవచ్చు.

రిటైర్డ్ టీచర్లు, పీజీ అభ్యర్థులు: రిటైర్ అయిన లాంగ్వేజ్ టీచర్లను తిరిగి నియమించుకోవడానికి లేదా ఆయా భాషల్లో పీజీ(Postgraduation) పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులను పార్ట్ టైమ్‌గా నియమించుకోవడానికి స్కూళ్లకు అనుమతి ఉంటుంది.

పాఠశాలలన్నీ తాము ఆఫర్ చేయబోయే మూడో భాష వివరాలను 2026 జూన్ 30లోగా సీబీఎస్‌ఈ ‘OASIS’ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు

సీఎం విజయ్, మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ ప్రకటన..

Updated Date - May 16 , 2026 | 06:02 PM