Share News

నాలుగు లక్షల మంది ‘రీ-వెరిఫికేషన్‌’ బాట

ABN , Publish Date - May 28 , 2026 | 06:34 AM

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు, రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై 2వారాలు గడుస్తున్నా ఇబ్బందులు సాగుతున్నాయి. ఈ ఏడాది సీబీఎస్ఈ...

నాలుగు లక్షల మంది ‘రీ-వెరిఫికేషన్‌’ బాట

  • సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి నలుగురిలో ఒకరు దరఖాస్తు

  • అస్పష్టమైన జవాబు పత్రాలు.. పత్రాల తారుమారుతో విద్యార్థుల ఆందోళన

  • సర్వర్ల క్రాష్‌.. 2వారాలైనా తెరుచుకోని పోర్టల్‌.. 29 దాకా వేచి చూడాల్సిందే!

తెలంగాణలో 23 మందిని బలితీసుకున్న సంస్థకే మళ్లీ కాంట్రాక్టా?: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 27: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు, రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై 2వారాలు గడుస్తున్నా ఇబ్బందులు సాగుతున్నాయి. ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పరీక్షలు రాసిన 17లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 4,04,319 మంది తమకు సంబంధించిన 11 లక్షల జవాబుపత్రాల స్కాన్‌ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఫలితాలు వెలువడిన మే 13 నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌ డౌన్‌ అవుతోంది. దరఖాస్తు చేసుకోవడానికే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోంది. కాగా, జవాబు పత్రా ల స్కాన్‌ కాపీల్లో చాలావరకు పత్రాలు అస్పష్టంగా (బ్లర్‌) కనిపిస్తుండగా, మరికొందరు విద్యార్థులకు ఏకంగా వేరొకరి జవాబు పత్రాలు దర్శనమిస్తున్నా యి. వేదాంత్‌ శ్రీవాస్తవ అనే విద్యార్థి సోషల్‌మీడియా వేదికగా.. బోర్డు పంపిన ఫిజిక్స్‌ జవాబు పత్రం తనది కాదని, వేరే విద్యార్థి జవాబు పత్రాన్ని జతచేశారని ఆధారాలతో సహా నిలదీయడంతో ఈ తప్పిదాలు వెలుగుచూశాయి. పైగా, న్యాయం అడిగిన విద్యార్థిని సోషల్‌మీడియా వేదికగా కొందరు పాకిస్థానీ ఏజెంట్‌ అంటూ ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. చివరకు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ పేపర్లు తారుమారు అయ్యాయంటూ స్వయంగా బోర్డే అంగీకరించడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది.


అప్లై చేయనివారి మార్కులపైనా ప్రభావం!

ఒక విద్యార్థి పేపర్లు మరొకరికి ట్యాగ్‌ చేయడం వల్ల ఒకరి మార్కులు తగ్గి, మరొకరికి అన్యాయంగా పెరిగి ఉంటాయి. అంటే, సమస్య దరఖాస్తు చేసుకున్న నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఆగదు. ఆ ప్రభావం దరఖాస్తు చేయని మిగిలిన లక్షలాది మంది విద్యార్థుల మెరిట్‌ను, కాలేజీ అడ్మిషన్ల ర్యాంకులను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని సవాల్‌ చేసేందుకు మార్కుల వెరిఫికేషన్‌, రీవ్యాల్యూయేషన్‌ పోర్టల్‌ మే 29వరకు కానీ తెరుచుకోదని బోర్డు ప్రకటించడంతో.. ఈ లోపు ప్రైవేటు కాలేజీల అడ్మిషన్ల గడువు ముగిసిపోతుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లు, ఆరోపణల నేపథ్యంలో బోర్డు ఇప్పటివరకు 8.9లక్షల జవాబు పత్రాలను డిజిటల్‌గా పంపించగా, మిగిలిన పెండింగ్‌ కాపీలను మే 27లోగా అందిస్తామని పేర్కొంది. బోర్డు మూల్యాంకన పోర్టల్‌ హ్యాకింగ్‌ కు గురైందా ? అనే అనుమానాలు వ్యక్తమవడంతో.. తమ ఆన్‌లైన్‌ వ్యవస్థలు సురక్షితంగానే ఉన్నాయని బోర్డు వివరణ ఇచ్చుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 06:38 AM