Actor Vijay: విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు.. ఈసారి ఎప్పుడంటే..
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:20 PM
కరూర్ తొక్కిసలాట ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ కు సీబీఐ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ఓసారి విచారణ చేయగా తాజాగా..
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ (CBI) మరోసారి టీవీకే చీఫ్, నటుడు విజయ్ (TVK Vijay) సమన్లు పంపింది. జనవరి 19న విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో విజయ్ తొలిసారి ఈనెల 12న సీబీఐ విచారణకు హాజరయ్యారు. సుమారు 6 గంటల సేపు సీబీఐ అధికారులు ఆయనపై వరుస ప్రశ్నలు సంధించారు. రెండోరోజు కూడా విచారణకు రావాలని కోరారు. అయితే పొంగల్ కావడంతో తనకు మరింత సమయం కావాలని విజయ్ కోరారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకేకు ఎలాంటి సంబంధం లేదని విచారణ సందర్భంగా విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని కూడా ఆయన చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు సైతం ఇంతకుమందు సీబీఐ ప్రశ్నించినట్టు ఇదే సమాధానం ఇచ్చారు. విజయ్‌ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం కావాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
టీవీకే ర్యాలీ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఘటన తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కాగా, చెప్పిన సమయం కంటే చాలా ఆలస్యంగా వేదిక వద్దకు విజయ్ రావడంతో ఒక్కసారిగా జనం తోసుసుకువచ్చి ఈ దుర్ఘటన జరిగిందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. ఆహారం, నీళ్లు, టాయ్ లెట్ సౌకర్యాలూ తగినంత లేకపోవడంతో అలిసిపోయిన జనసమూహం అదుపుతప్పిందని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను విజయ్ తోసిపుచ్చారు. దీనిని అధికార డీఎంకే కుట్రగా పేర్కొన్నారు. విజయ్ ఆరోపణలను డీఎంకే ఖండించింది.
ఇవి కూడా చదవండి..
బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ఎన్డీయే వైపు చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి