Share News

రూ.84 వేల కోట్లతో సాగర మథనం

ABN , Publish Date - Aug 01 , 2026 | 06:04 AM

పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడ్డ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించి.. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు సముద్ర అంతర్భాగాల్లో చమురు, సహజవాయువుల అన్వేషణపై...

రూ.84 వేల కోట్లతో సాగర మథనం

  • సంద్రంలో చమురు, సహజవాయు నిక్షేపాల వేట

  • 2030-31 దాకా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పొడిగింపు

  • వచ్చే ఐదేళ్లకుగాను రూ.3.15 లక్షల కోట్ల వ్యయ అంచనా

  • విస్తరించిన ఖేలో ఇండియా పథకానికి రూ.29 వేల కోట్లు

  • ప్రధానమంత్రి సూర్య సరోవర్‌ యోజనకు రూ.5,070 కోట్లు

  • ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర

న్యూఢిల్లీ, జూలై 31: పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడ్డ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించి.. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు సముద్ర అంతర్భాగాల్లో చమురు, సహజవాయువుల అన్వేషణపై కేంద్రం దృష్టి సారించింది. ఈమేరకు.. రూ.84,084 కోట్లతో చేపట్టనున్న ‘సముద్ర మంథన్‌’ పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ దీంతోపాటు పలు కీలక పథకాలకు అంగీకారం తెలిపింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని రూ.3.15 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మరో ఐదేళ్లపాలు పొడిగించాలని నిర్ణయించింది. సవరించిన ఖేలో ఇండియా పథకానికి రూ.29 వేల కోట్లు, ప్రధానమంత్రి సూర్యసరోవర్‌ యోజనకు రూ.5,070 కోట్లు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో.. సముద్ర మంథన్‌ పథకానికి కేటాయించిన రూ.84,084 కోట్లలో రూ.43,200 కోట్లను వచ్చే ఐదేళ్లలో ‘డీప్‌ సీ డ్రిల్లింగ్‌’కు (అంటే సముద్రంలోని లోతైన, అత్యంత లోతైన ప్రాంతాల్లో తవ్వకాలకు) ఉపయోగించనున్నారు. అలాగే.. ఆఫ్‌షోర్‌ డేటా సేకరణకు రూ.28,534 కోట్లు, గుర్తించిన చమురు, సహజవాయు నిల్వల నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల నిమిత్తం రూ.10 వేల కోట్లు, ఆయిల్‌, గ్యాస్‌ తయారీ, సేవా జోన్ల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తారు. దేశీయంగా సముద్ర తీర ప్రాంతాల్లో చమురు నిల్వల అన్వేషణను ఈ పథకం వేగవంతం చేస్తుందని, పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అలాగే.. క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాబోయే ఐదేళ్లకుగాను రూ.36,441 కోట్లతో సవరించిన ఖేలో ఇండియా ప్రణాళికకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది ఇందులో.. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారుచేయడానికి రూ.29,054 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో రూ.7,387 కోట్లను జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయంగా అందించనున్నారు. సవరించిన ఖేలో ఇండియా పథకం కింద ప్రధానంగా.. ఇప్పటికే ఉన్న ఖేలో ఇండియా అథ్లెట్ల కార్యక్రమంతో పాటు ’ఎమర్జింగ్‌ ఖేలో ఇండియా అథ్లెట్స్‌’ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది దేశీయ క్రీడా పోటీల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.


పీఎం కిసాన్‌ మరో ఐదేళ్లు పొడిగింపు

దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు (2030-31 వరకూ) పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రానున్న ఐదేళ్ల కాలానికిగాను రూ.3.15 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే.. దేశంలోని నీటి నిల్వలు, రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసి వచ్చే ఐదేళ్లలో 5000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తే లక్ష్యంగా రూపొందించిన ‘ప్రధాన మంత్రి సూర్యసరోవర్‌ ప్రాజెక్టు’కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.5,070 కోట్లు కేటాయించింది.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 06:04 AM