Share News

బస్సు- ట్రక్కు ఢీకొని ముగ్గురి మృతి, 30 మందికి గాయాలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:20 PM

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు- ట్రక్కు ఢీకొని ముగ్గురి మృతి, 30 మందికి గాయాలు
Road Accident in Rajasthan

రాజస్థాన్‌: అల్వార్ జిల్లా రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ (Rajgarh police station) పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ (మంగళవారం) ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఉజ్జయిని నుంచి ఢిల్లీకి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. పినాన్ సమీపం ఛానల్ నంబర్-100 ఇంటర్‌చేంజ్ వంతెన వద్దకు రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో డ్రైవర్, మహిళ, చిన్నారి ఉన్నారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మందిని అల్వార్‌ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిని జైపూర్‌కు, ఇంకొంత మందిని రాజ్‌గఢ్, రైనికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ముందే హెచ్చరించాం..

అయితే, ప్రమాదానికి ముందే తాము డ్రైవర్‌ను హెచ్చరించామని బాధితులు చెబుతున్నారు. అతను పలుమార్లు కునుకు తీశాడని, అది గమనించి రోడ్డుపక్కన వాహనం నిలపాలని కోరినట్లు తెలిపారు. అయినా, తమ మాట వినకుండా అతి వేగంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు సైతం నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రమాదానికి గురైన రెండు గంటల తర్వాత మాత్రమే వారు సంఘటనా స్థలానికి వచ్చారని మండిపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజేశ్ మీనా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

నోయిడా అల్లర్లకు పాకిస్థాన్‌తో సంబంధాలు: మంత్రి సంచలన కామెంట్లు..

Updated Date - Apr 14 , 2026 | 12:40 PM