Share News

లోధి ఎస్టేట్‌లో కేజ్రీవాల్ శీష్ మహల్ 2... బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆప్

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:40 PM

లోధి ఎస్టేట్‌ ప్రభుత్వ బంగ్లాలోకి ఇటీవల మారిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి బీజేపీ విమర్శలు గుప్పించింది. తన అధికారిక నివాసాన్ని ప్రైవేటు మనీతో లగ్జరీ ఇల్లుగా మార్చుకున్నారని, రెండో శీష్ మహల్ నిర్మించుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది.

లోధి ఎస్టేట్‌లో కేజ్రీవాల్ శీష్ మహల్ 2... బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆప్
Arvind Kerjriwal

న్యూఢిల్లీ: లోధి ఎస్టేట్‌ ప్రభుత్వ బంగ్లాలోకి ఇటీవల మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ప్రైవేటు మనీతో లగ్జరీ ఇల్లుగా మార్చుకున్నారని, రెండో శీష్ మహల్ (అద్దాలమేడ) నిర్మించుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది.


నిరాడంబర జీవితాన్ని గడుపుతానని చెప్పిన కేజ్రీవాల్ శీష్ మహల్-2ను నిర్మించుకున్నారని, విలాసవంతమైన జీవితానికి ఆయన అలవాటు పడ్డారని ఢిల్లీ ప్రజాపనుల శాఖ మంత్రి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ శనివారంనాడిక్కడ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ధురంధర్ ఓటర్లు శీష్ మహల్‌ నుంచి కేజ్రీవాల్‌ను పంపించేయడంతో కేజ్రీవాల్ పంజాబ్‌కు షిఫ్ట్ అయ్యారని, అక్కడ ఒక భవనాన్ని ఆక్రమించుకున్నారని, ఇప్పుడు లోథి ఎస్టేట్‌లో శీష్ మహల్-2న నిర్మించుకున్నారని చెప్పారు. జాతీయపార్టీగా ఆప్ చీఫ్‌కు కేంద్రం టైప్-7 బంగ్లా కేటాయించిందని, అయితే అందులో అత్యంత విలాసవంతమైన సౌకర్యాల కోసం ప్రైవేటు మనీ ఖర్చుచేశారని అన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేశారు? ఆ సొమ్ము ఎక్కడిది అని ప్రశ్నించారు. లోధి ఎస్టేట్‌ ఫోటోలను మీడియా ముందు ఆయన ప్రదర్శించారు.


నిజంకాదు.. ఫేక్

శీష్ మహల్ 2 పేరుతో వర్మ విడుదల చేసిన ఫోటోలు నిజం కాదని, ఫేక్ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. 'వర్మ విడుదల చేసిన ఫోటోలు నకిలీవి. అవి కేజ్రీవాల్ ఇంటికి సంబంధించినవి కావు. రేఖాగుప్తా (ముఖ్యమంత్రి), లెఫ్టినెంట్ గవర్నర్ సాహిబ్ కూడా తమ ఇళ్లు తెరిచి చూపించాలి. కేజ్రీవాల్ కూడా తన ఇల్లు చూపిస్తారు. అప్పుడు ఎవరి ఇల్లు విలావంతంగా ఉందో ప్రజలే నిర్ణయిస్తారు' అని అతిషి అన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై వర్మ గెలిచారు.


ఇవి కూడా చదవండి..

హర్భజన్ సింగ్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తల నిరసన

ఫిరాయింపు ఎంపీలను అనర్హులుగా ప్రకటించండి.. ఉపరాష్ట్రపతిని కోరనున్న ఆప్

Updated Date - Apr 25 , 2026 | 05:44 PM