Share News

ఫిరాయింపు ఎంపీలను అనర్హులుగా ప్రకటించండి.. ఉపరాష్ట్రపతిని కోరనున్న ఆప్

ABN , Publish Date - Apr 25 , 2026 | 03:45 PM

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి ఉద్వాసన చెప్పి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనమైంది. వీరిపై తక్షణ చర్యలకు కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' కసరత్తు చేస్తోంది.

ఫిరాయింపు ఎంపీలను అనర్హులుగా ప్రకటించండి.. ఉపరాష్ట్రపతిని కోరనున్న ఆప్
Sanjay Singh

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)తో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి ఉద్వాసన చెప్పి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనమైంది. వీరిపై తక్షణ చర్యలకు కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' కసరత్తు చేస్తోంది. బీజేపీలో విలీనమవుతున్నట్టు ప్రకటించిన ఏడుగురు ఎంపీల సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరనున్నట్టు ఆప్ సీనియర్ నేత సంజయ సింగ్ శనివారంనాడు తెలిపారు. ఈమేరకు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయనున్నట్టు చెప్పారు.


ఎగువసభలోని పార్టీ మెజారిటీ ఎంపీలు బీజేపీతో విలీనం కావాలని నిర్ణయించినట్టు రాఘవ్ చద్దా శుక్రవారంనాడు సంచలన ప్రకటన చేశారు. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా రాజ్యసభలోని 2/3 వంతు ఆప్ ఎంపీలు బీజేపీలో విలీనం అవుతున్నట్టు తెలిపారు. తమ సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభకు చైర్మన్‌కు సమర్పించామని చెప్పారు.


కాగా, పార్టీ ఎంపీల ఫిరాయింపులను రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక ప్రొవిజన్స్ ప్రకారం సవాలు చేస్తామని సంజయ్ సింగ్ తెలిపారు. బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌‌ల రాజ్యసభ సభ్యత్వంపై అనర్హుల వేటు వేయాలని కోరనున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ తమ ఎంపీలు బీజేపీలో చేరడం ఆప్‌ను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.


ఇవి కూడా చదవండి..

నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

బెంగాల్‌లో బీజేపే సునామీ.. 200 సీట్లకు పైనే గెలుస్తాం

Updated Date - Apr 25 , 2026 | 03:49 PM