జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి హవా.. అతిపెద్ద పార్టీగా బీజేపీ
ABN , Publish Date - Feb 09 , 2026 | 08:39 PM
మహాయుతి కూటిమిలోని బీజేపీ 208 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) 126 సీట్లు గెలుచుకోగా, షిండే శివసేన 120 సీట్లు సాధించింది. ప్రతిపక్ష 'మహా వికాస్ అఘాడి' 103 సీట్లు గెలుచుకుంది.
ముంబై: మహారాష్ట్ర జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సాయంత్రం 7 గంటల వరకూ వెలువడిన ఫలితాల్లో 'మహాయుతి' కూటమి మరోసారి 'మహా వికాస్ అఘాడి'పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 731 స్థానాలకు గాను 587 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, 454 స్థానాల్లో బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్)తో కూడిన 'మహాయుతి' కూటమి గెలుపు సాధించింది.
మహాయుతి కూటిమిలోని బీజేపీ 208 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) 126 సీట్లు గెలుచుకోగా, షిండే శివసేన 120 సీట్లు సాధించింది. ప్రతిపక్ష 'మహా వికాస్ అఘాడి' 103 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్-46, శివసేన (యూబీటీ)-38, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) 19 సీట్లు సాధించాయి. ఈ రెండు ప్రధాన కూటములతో పాటు ఇండిపెండెంట్లు సైతం 30 సీట్లు గెలుచుకున్నారు.
జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు
12 జిల్లాపరిషత్‌లతో పాటు వాటి పరిధిలోకి వచ్చే 125 పంచాయతీ సమితుల్లో ఈ ఎన్నికలు జరిగాయి. 12 జిల్లా పరిషత్‌లలో రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, పుణె, సతారా, సాంగ్లి, షోలాపూర్, కొల్హాపూర్, ఛత్రపతి శంభాజీనగర్, పర్భని, ధారాశివ్, లాటూరు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, నిధుల కేటాయింపుల్లో జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితులు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఫలితాలు ఆధారంగా ఆయా జిల్లా పరిషత్‌లలో ఎవరు అధికారంలోకి వస్తారనేది స్పష్టమవుతుంది.
2017 ఎన్నికల్లో...
రాయగడ్, రత్నగిరి, సింధ్‌దుర్గ్, పుణె, సతారా, సాంగ్లి, షాలాపూర్, కొల్హాహూర్, ఔరంగాబాద్, పర్భని, ఒస్మానాబాద్ (ధారాశివ్), లాతూరు జిల్లా పరిషత్‌లు, వాటి భాగస్వామ్య పంచాయతీల్లో 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 12 జిల్లాలో 225 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా పుణెలో 44, సతారాలో 39, ఒస్మానాబాద్‌లో 26, పర్భనిలో 24 సీట్లు గెలుచుకుని పటిష్టంగా నిలిచింది. పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడాలోని కొన్ని ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బీజేపీ 141 సీట్లు గెలుచుకోగా, లాలూతూరులో 36, సాంగ్లిలో 23, ఔరంగాబాద్‌లో 22 సీట్లతో తమ పట్టు చాటుకుంది. కాంగ్రెస్ 123 సీట్లు సాధించింది. సింధుదుర్గ్‌లో 27 సీట్లతో సత్తా చాటింది. ఔరంగాబాద్‌లో 14, కొల్హాపూర్‌లో 14 సీట్లు సాధించింది. శివసేన 119 సీట్లు దక్కించుకుంది. రాయగఢ్‌లో 18, రత్నగిరిలో 18, పుణెలో 13 సీట్లు కైవసం చేసుకుంది. ఇతరులు 80 స్థానాల్లో గెలుపొందారు. బీఎస్‌పీ, సీపీఐ, సీపీఎం, ఎంఎన్‌ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయాయి.
ఇవి కూడా చదవండి..
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం