Share News

రైలులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

ABN , Publish Date - May 18 , 2026 | 08:51 AM

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువకముందే మరోకటి చోటు చేసుకుంది. బిహార్‌లోని ససారంలో రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది.

రైలులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

న్యూఢిల్లీ, మే 18: బిహార్‌లోని ససారం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ససారం నుంచి పాట్నా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే స్టేషన్‌లోని వివిధ ప్లాట్ ఫామ్‌లపై ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు.


ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పాట్నా వెళ్లేందుకు ససారం రైల్వే స్టేషన్‌లోని ఆరో ప్లాట్‌ఫాంపై ఈ ప్యాసింజర్ రైలును నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.


ఆదివారం మధ్యప్రదేశ్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రత్లాం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగిన ఘటనలో రెండు కోచ్‌లు దెబ్బతిన్నాయి. నిత్యం బిజీగా ఉండే ముంబై - ఢిల్లీ మార్గంలో దాదాపు 7 గంటల పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated Date - May 18 , 2026 | 09:09 AM