Share News

గంగా నదిలో పడవ బోల్తాపడి ఇద్దరి మృతి

ABN , Publish Date - May 28 , 2026 | 10:35 AM

బిహార్ రాష్ట్రం పాట్నా జిల్లా బర్హ్ సబ్-డివిజన్‌లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు.

గంగా నదిలో పడవ బోల్తాపడి ఇద్దరి మృతి

బిహార్: పాట్నా జిల్లా బర్హ్ సబ్-డివిజన్‌లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు. బలమైన గాలుల కారణంగా పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. గంగా ఘాట్ వద్దకు వచ్చిన సుమారు 14 నుంచి 15 మంది నది అందాలను చూసేందుకు పడవ ఎక్కారు. గంగా నది మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. కాపాడాలంటూ బాధితులు కేకలు వేశారు.


ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బోట్ల సహాయంతో ఐదుగురిని రక్షించగా.. మిగతా వారంతా గల్లంతయ్యారు. బోట్ల యజమానుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలనూ రంగంలోకి దింపారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఇద్దరి మృతదేహాలు లభించాయని, మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బర్హ్ ఎస్‌డీపీవో రామకృష్ణ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

సిద్ధరామయ్య రాజీనామా సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్..

వీర్ సావర్కర్ జయంతి.. ఆయన ధైర్యం, దేశభక్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: ప్రధాని

Updated Date - May 28 , 2026 | 11:05 AM