కారు పైభాగంలో సీక్రెట్ ఛాంబర్.. స్మగ్లర్ల తెలివికి షాక్ అయిన పోలీసులు
ABN , Publish Date - Nov 07 , 2026 | 09:36 PM
బిహార్‌లో లిక్కర్ స్మగ్లర్లు రోజురోజుకూ తెలివి మీరిపోతున్నారు. మద్యం అక్రమ రవాణా కోసం కొత్త కొత్త దారులు కనిపెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో లిక్కర్ స్మగ్లర్లు రోజురోజుకూ తెలివి మీరిపోతున్నారు. మద్యం అక్రమ రవాణా కోసం కొత్త కొత్త దారులు కనిపెడుతున్నారు. తాజాగా బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లిక్కర్‌ను స్మగుల్ చేసిన విధానం చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఆ రాష్ట్రంలోని గోవింద్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ఈరోజు (శనివారం) పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడికి ఒక కారు వచ్చింది. దాన్ని మొదటిసారి చూసినప్పుడు పోలీసులకు పెద్ద అనుమానమేమీ రాలేదు. అయినా తనిఖీలో భాగంగా కారును పరిశీలించారు. అప్పుడే పోలీసులకు మతిపోయే విషయం తెలిసింది. స్మగ్లర్లు ఆ కారును పూర్తిగా మోడిఫై చేశారు. దాని పైభాగాన్ని కోసి.. అక్కడ ఒక ప్రత్యేక ఛాంబర్‌నే నిర్మించారు. అందులో వందలాది లీటర్ల మద్యం నిల్వ చేసిన టెట్రా ప్యాక్స్‌లను దాచారు. (పాలు, ఫ్రూట్ జ్యూస్ లాంటి ద్రవ పదార్థాలు పాడవకుండా టెట్రా ప్యాక్స్ వాడతారు) .
సాధారణంగా కారులోపల ఉన్న రహస్య ఛాంబర్ ఎవరి కంటాపడదు. అందులో మద్యం ఉన్నట్టు అనుమానమూ రాదు. ఆ ఛాంబర్‌ను చూసి పోలీసులు మొదట విస్తుపోయారు. తరువాత అందులోంచి మద్యం నిల్వ చేసిన టెట్రా ప్యాక్స్‌లను బయటకు తీశారు. లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు రోహన్‌ను, కారు డ్రైవర్ మహమ్మద్ అస్లాంలను అరెస్ట్ చేశారు. కాగా రోహన్ ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీలో నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టామని వివరించారు.
ఈ వార్తలూ చదవండి
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు
పార్కింగ్ వివాదం.. టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ హత్య..