Share News

ఢిల్లీ విమానాశ్రయంలో 3 గంటల పాటు నిర్బంధం.. కేంద్రంపై పంజాబ్ సీఎం తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:19 PM

పారిస్ పర్యటన నుంచి తిరిగొచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు మూడు గంటల పాటు ఆపి, రూ.50 వేల జరిమానా విధించడంపై రాజకీయ వివాదం చెలరేగింది.

ఢిల్లీ విమానాశ్రయంలో 3 గంటల పాటు నిర్బంధం.. కేంద్రంపై పంజాబ్ సీఎం తీవ్ర ఆరోపణలు
Bhagwant Mann Airport Allegations

ఢిల్లీ, అక్టోబర్ 23: పారిస్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తనను ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు మూడు గంటల పాటు ఆపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కస్టమ్స్ చీఫ్‌పై ఆరోపణ: ఢిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ అధికారి మనీష్ కుమార్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు స్వయానా సొంత తమ్ముడని మాన్ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కక్ష సాధించడానికే అధికారులు ఈ వేధింపులకు పాల్పడ్డారని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

పారిస్‌లో జరిగిన ఒక ఆహార మహోత్సవంలో పంజాబ్ మార్క్‌ఫెడ్ స్టాల్‌ను సందర్శించడానికి తనకు మొదట అనుమతి నిరాకరించారని, ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్న తర్వాతే తాను అక్కడికి వెళ్లగలిగానని మాన్ తెలిపారు.

విమానాశ్రయంలో తనిఖీలు, చలానా: పారిస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో తన లగేజీని దాదాపు రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారని, కానీ ఎలాంటి అక్రమ వస్తువులు దొరకలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తనకు యాభై వేల రూపాయల జరిమానా (చలానా) విధించారని తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లే అధికారులు ఇలా వ్యవహరించారని ఆరోపించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నాయకులే నియంతలా వ్యవహరించే సరికొత్త ధోరణి దేశంలో కొనసాగుతోందని మాన్ విమర్శించారు.

ప్రజాస్వామ్య సంస్థల బలహీనత ఎన్నికల ప్రక్రియ స్వతంత్రతను ప్రశ్నార్థకం చేస్తూ, దేశంలో కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర పంజాబ్‌కు ఉందని ఆయన అన్నారు. ఎన్నికల సమయాలకే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను రంగంలోకి దించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని పట్టించుకోరని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటిపై విపక్షాల నుంచి కూడా విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

(Bhagwant Mann Airport Allegations)


ఇవి కూడా చదవండి:

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

వన్డేల్లో జో రూట్ అరుదైన రికార్డు.. ఇంగ్లాండ్ తరఫున తొలి బ్యాటర్ గా..

చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. గిల్ రికార్డు బ్రేక్

Updated Date - Oct 23 , 2026 | 05:50 PM