బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..
ABN , Publish Date - Aug 15 , 2026 | 02:48 PM
బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేస్తున్నారు (Bengaluru terror links).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాకు చెందిన అసఫూల్ మల్లిక్ బెంగళూరులోని జిగణి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. బొమ్మసంద్ర పారిశ్రామిక ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో మల్లిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు (TTP links Afghanistan).
పాకిస్థాన్ సైన్యం ముస్లింలపై దాడులకు పాల్పడుతోందనే భావనతో తాను ఆగ్రహానికి గురైనట్లు మల్లిక్ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో పాకిస్థాన్ వైఖరిపైనా అతడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతదేశంలో ముస్లింలకు ఇబ్బందులు ఎదురైతే ప్రతీకారం తీర్చుకోవాలని అతడిని ప్రేరేపించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు (Bengaluru terror case).
ఫేస్‌బుక్ ద్వారా అఫ్గానిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ హైదర్ అనే వ్యక్తితో మల్లిక్ పరిచయం పెంచుకున్నట్లు వెల్లడైంది. అఫ్గాన్‌కు చెందిన టీటీపీ ఉగ్రసంస్థ హ్యాండ్లర్లతో అతడు తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తేలింది. భారత్, పాకిస్థాన్‌లో దాడులకు వారు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌కు వెళ్లి ఉగ్రసంస్థలో చేరడానికి కూడా అతడు సిద్ధమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
స్త్రీశక్తి పథకానికి ఏడాది.. మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు ప్రయాణం