నగదు, ఆస్తి కావాలంటూ మహిళ బ్లాక్ మెయిల్.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య..
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:43 AM
బెంగళూరులో ప్రముఖ జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఓ వివాహిత బ్లాక్‌మెయిల్ చేయడమే బలవన్మరణానికి కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక: బెంగళూరులో ప్రముఖ జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఓ వివాహిత బ్లాక్‌మెయిల్ చేయడమే బలవన్మరణానికి కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రస్థాయిలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పేరొందిన దిలీప్(28) అనే యువకుడు ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలేం జరిగిందంటే..
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, దిలీప్ ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అదే జిమ్‌కు వచ్చే 42 ఏళ్ల వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తమకు తెలియడంతో పోలీసుల వరకూ వెళ్లామని బాధిత కుటుంబం తెలిపింది. అప్పట్లో ఆ మహిళ భర్త సమక్షంలోనే పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆమె బ్లాక్ మెయిల్ చేయడం మెుదలుపెట్టిందని వారు తెలిపారు. డబ్బు, ఆస్తి కోసం దిలీప్‌ను వేధించిందని ఆరోపించారు.
మహిళ వేధింపులు తాళలేక దిలీప్ మానసికంగా కుంగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గత రాత్రి తన అన్న ఆత్మహత్య గురించి యోగిత అనే యువతి మెసేజ్ చేసిందని బాధితుడి సోదరి చెప్పింది. దిలీప్ గది తలుపులు కొట్టామని, ఎలాంటి స్పందన లేకపోవడంతో పగలకొట్టి లోపలికి వెళ్లామని తెలిపింది. ఆత్మహత్య ఘటన చూసి నిర్ఘాంతపోయినట్లు వెల్లడించింది. తమ కుటుంబసభ్యుడి మరణానికి కారణమైన మహిళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు.
ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆకర్షణతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..
తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం.. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు