Share News

లోక్‌సభలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యంలో ఛాంపియన్ ఎవరంటే..

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:12 PM

మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్‌తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు.

లోక్‌సభలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యంలో ఛాంపియన్ ఎవరంటే..
Mamata Banerjee and Mahua Moitra

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఐదు పార్టీల పేర్లను ప్రస్తావిస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ఈ పార్టీలు అడ్డుకున్నాయని అన్నారు. ఆయన చెప్పిన పార్టీల్లో బెంగాల్‌లోని అధికార టీఎంసీకి మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యం వహిస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలనలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మహిళలకు హక్కులు దక్కకుండా కాంగ్రెస్‌తో టీఎంసీ కుమ్మక్కై బిల్లును అడ్డుకుందంటూ ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాజాగా విమర్శించగా, మహిళలకు ప్రాతనిధ్యం కల్పించడంలో టీఎంసీ ఛాంపియన్ అని మమతా బెనర్జీ తిప్పికొట్టారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను సమర్ధిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తాజాగా ట్వీట్ చేశారు.


బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలకు లోక్‌సభలో ఉన్న స్థానాలు, వాటిల్లో మహిళా ప్రాతినిధ్యంపై గణాంకాలను మహువా మెయిత్రా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలోని అన్ని పార్టీలకంటే మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న పార్టీ బీజేపీయేనని, 543 సీట్ల ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? మిమ్మల్ని ఎవరు ఆపారు? అంటూ ప్రధానిని ఆమె నిలదీశారు.


లోక్‌సభలో పార్టీలు.. మహిళా ప్రాతినిధ్యం

పార్టీలు, లోక్‌సభ ఎంపీలు, మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించిన మహువా మొయిత్రా పేర్కొన్న గణాంకాల ప్రకారం, 18వ లోక్‌‌సభకు 75 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 543 మంది సభ్యుల్లో ఇది 14 శాతం. టీఎంసీకి చెందిన 29 మంది ఎంపీల్లో 11 మంది మహిళా ఎంపీలున్నారు. ఆ ప్రకారం మహిళా ఎంపీల శాతం 37.90గా ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో డీఎంకే ఉంది. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీల్లో నలుగురు మహిళా ఎంపీలు ఉన్నారు. ఆ ప్రకారం డీఎంకేలో మహిళా ఎంపీలు 18 శాతానికి కొద్దిగా ఎక్కువే. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) మూడో స్థానంలో ఉంది. ఆ పార్టీకి చెందిన 37 మంది ఎంపీల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. వారి ప్రాతినిధ్యం 13.5 శాతంగా ఉంది. అతిపెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను తీసుకుంటే.. కాంగ్రెస్‌కు ఉన్న 99 మంది ఎంపీల్లో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి శాతం 14.1గా ఉంది. బీజేపీకి 31 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. సంఖ్య పరంగా ఇది అత్యధికమే అయినప్పటికీ ఆ పార్టీకి ఉన్న 240 మంది ఎంపీల్లో మహిళల శాతం 12.9గా ఉంది.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి: మోదీ పిలుపు

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Apr 19 , 2026 | 05:32 PM