సీబీఐ పేరుతో మోసం.. రూ.15.45 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:01 PM
కర్ణాటకలోని బెళగావిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారుల పేరుతో వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడి దగ్గర రూ.15.45 కోట్లు కొట్టేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని బెళగావిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారులమని నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.15.45 కోట్లు దోచుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారులుగా నటిస్తూ ఓ వృద్ధుడికి వీడియో కాల్ చేశారు. ఓ కేసులో ఇరికిస్తామని బెదిరిస్తూ ఒత్తిడి తెచ్చారు. దాదాపు నెల రోజులపాటు వాట్సాప్ కాల్స్ ద్వారా భయపెట్టి, పలుమార్లు ఆ వృద్ధుడితో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు కేటుగాళ్లు.
తనపై ఎక్కడ కేసు నమోదు అవుతుందో అని భయాందోళనకు గురైన ఆ వృద్ధుడు.. భయంతో సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి భారీ మొత్తాన్ని పంపాడు. ఆ తర్వాత మోసపోయినట్టు గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు కాల్ డేటా వివరాలు, బ్యాంక్ లావాదేవీలపై విచారణ సాగిస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్, డబ్బుల డిమాండ్లు వంటి వాటిని నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
Also Read:
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే
For More Latest News