అఖిలేశ్ కూడా ఆరు నెలలు జైలుకు వచ్చి ఉంటే.. వేదికపైనే మనసులో మాట చెప్పిన ఆజం ఖాన్
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:47 PM
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆజం ఖాన్ మరోసారి తన జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆజం ఖాన్ మరోసారి తన జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అఖిలేశ్ యాదవ్ కూడా ఆరు నెలల పాటు జైలులో ఉంటే అక్కడి బాధలు ఆయనకు తెలిసేవని తన కుమారుడితో అంటుండేవాడినని చెప్పారు. ఐదున్నరేళ్ల జైలు జీవితం తన శరీరం, మనసుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు (Azam Khan Jail Story).
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఆజం ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జైలు అనుభవాలను ఆజం ఖాన్ వివరించారు. 'ఒకసారి జైలు నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో నన్ను, నా కుమారుడు అబ్దుల్లాను వేర్వేరు వాహనాల్లో తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మమ్మల్ని వేర్వేరుగా ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించినా అధికారులు సమాధానం చెప్పలేదు. అప్పుడు అబ్దుల్లాతో.. ఇదే మన చివరి కలయిక కావచ్చని చెప్పా. ఇక్కడ మళ్లీ కలవకపోతే మరో లోకంలో కలుసుకుందామని చెప్పా. ఈ ఘటన నా జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన అనుభవం' అని ఆజంఖాన్ వివరించారు (Azam Khan Speech).
'ఐదున్నరేళ్ల జైలు జీవితం నన్ను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కుంగదీసింది (Uttar Pradesh Elections). నా భార్య, కుమారుడు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఒకవేళ అఖిలేష్ యాదవ్ కూడా జైలుకు వస్తే.. ఇక్కడ ఎలా ఉంటారు? రాత్రులు ఎలా గడుస్తాయి? ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అన్నది స్వయంగా తెలుసుకునేవారని అనుకునేవాడిని. నన్ను, నా కుటుంబాన్ని ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలు తీవ్రంగా వేధించాయి' అని ఆజంఖాన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..