రామజన్మభూమికి ఆపద్ధర్మ సారథి
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:52 AM
అయోధ్య రామ మందిర నిధుల దోపిడీపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో సోమవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి...
చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
న్యూఢిల్లీ/అయోధ్య, జూలై 6: అయోధ్య రామ మందిర నిధుల దోపిడీపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో సోమవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌రాయ్ చేసిన రాజీనామాను ధర్మకర్తల మండలి ఆమోదించింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ట్రస్టు శాశ్వత సభ్యుడు కృష్ణమోన్‌ను నియమించింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ట్రస్టు సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తొమ్మిది మంది శాశ్వత సభ్యుల్లో చంపత్ రాయ్, అనిల్ మిశ్రలు మినహా ఏడుగురు హాజరయ్యారు. ట్రస్టు చైర్మన్ నృత్యగోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ప్రత్యేక ఆహ్వానితుడు గోపాలరావును ఈ సమావేశానికి పిలవలేదు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకాన్ని నృత్యగోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ దాస్ ఽధ్రువీకరించారు.
ఎవరీ కృష్ణ మోహన్?
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కి చెందిన కృష్ణ మోహన్(73) ఇండియన్ ఫారెస్టు సర్వీసు అధికారిగా పనిచేశారు. ట్రస్టు శాశ్వత సభ్యుడైన కామేశ్వర్ చౌపాల్ మరణించిన అనంతరం గత ఏడాది సెప్టెంబరులో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయనది కూడా చౌపాల్ సామాజిక వర్గమే. అప్పటి నుంచి ట్రస్టు కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నేపథ్యంలో కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. ఆలయ నిర్వహణలో కొన్ని లొసుగులు ఉండడంతో కొందరు వాటిని అవకాశంగా మార్చుకొని దోపిడీ చేశారని తెలిపారు. వాటిని అరికట్టడమే తన ప్రథమ లక్ష్యమని చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ట్రస్టు చైర్మన్ నృత్యగోపాల్ దాస్ ప్రకటన విడుదల చేస్తూ విరాళాల చోరీ జరగడం బాధించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాన కార్యదర్శిగా భజరంగ్?
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదుపరి ప్రధాన కార్యదర్శిగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి భజరంగ్ బాగ్రా నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఆలయ రోజువారీ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)ను నియమించాలని ట్రస్టు నిర్ణయించింది. ఇందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ కోహ్లీ నేతృత్వంలో ముగ్గురితో సెర్చి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సీఈవో పదవి కోసం ముగ్గురు అర్హుల పేర్లను సిఫార్సు చేయాలని సూచించింది.
మొత్తం విరాళాలు 3,264 కోట్లు
చోరీ ఆరోపణల నేపథ్యంలో ఇంతవరకు అందిన విరాళాల వివరాలను ట్రస్టు విడుదల చేసింది. రూ.3,264 కోట్లు విరాళాలుగా అందాయని, అందులో రూ.2,370 కోట్లు ఆలయ నిర్మాణానికి, ఇతర పెట్టుబడులకు వ్యయమయ్యాయని తెలిపింది. భక్తుల నుంచి హుండీల ద్వారా రూ.391 కోట్లు రాగా, వాటిని అలయ నిర్వహణకు వినియోగిస్తున్నట్టు పేర్కొంది. కానుకలుగా అందిన వెండి నగలను కరిగించి కడ్డీల రూపంలో భద్రపరిచినట్టు వివరించింది.
ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు: వీహెచ్‌పీ
అంతకుముందు వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్రజైన్ మీడియాతో మాట్లాడుతూ చంపత్‌రాయ్‌ను సమర్థించారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేరస్తులు కాదని చెప్పారు. ‘‘దర్యాప్తు సంస్థలను వాటి పనిని చేయనీయండి’’ అని వ్యాఖ్యానించారు. నైతిక బాధ్యత వహించి చంపత్‌రాయ్ రాజీనామా చేసి, విలువలు పాటించారన్నారు. కాగా, అయోధ్య విరాళాల వ్యవహారంలో ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు వీహెచ్‌పీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. గతంలో సొంత అనుబంధ సంస్థ అయిన ‘నిర్మోహి అఖారా’నే వీహెచ్‌పీపై రూ.1,400 కోట్ల రామమందిర విరాళాల కుంభకోణం ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News