కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:06 AM
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఈ రోజు (గురువారం) ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కేరళంలో 140 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. యూడీఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటముల మధ్య గట్టిపోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 99 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 41 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు పరిమితం అయింది.
పుదుచ్చేరిలో 23, కారైక్కాల్‌లో 5, మాహే, యానాంలో ఒక్కో స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ 30 అసెంబ్లీ స్థానాలలో 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో జాతీయ పార్టీలకు చెందిన వారు 34 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఆల్ఇండియా ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఆల్ఇండియా ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఎస్. రంగసామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సారి కూడా రెండు పార్టీలు కూటమిగా బరిలో దిగాయి. ఈ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్, డీఎమ్‌కేలు కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇక, అస్సాం విషయానికి వస్తే మొత్తం 126 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి మెజార్టీ సాధించి అధికారాన్ని చేపట్టింది. బీజేపీ నుంచి హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సారి కూడా బీజేపీ కూటమితోటే బరిలో దిగుతోంది. రాష్ట్రంలో ఎన్‌డీఏ, ఇండియా కూటముల మధ్య పోటీ నడుస్తోంది. ఈ రోజు కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి
అతిగా మద్యం తాగి.. కారులో దూసుకొచ్చి
డబుల్ బెడ్రూం కాలనీల్లోని దుకాణాల వేలం