అతిగా మద్యం తాగి.. కారులో దూసుకొచ్చి
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:00 AM
అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి అమితవేగంతో కారులో దూసుకొస్తూ.. బైకుపై యూటర్న్ తీసుకోబోతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ఢీకొట్టడంతో పాటు వారిని 100 మీటర్ల మేర బైకుతో సహా ఈడ్చుకెళ్లాడు.
ఇద్దరు బీటెక్ విద్యార్థులను ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన తాగుబోతు
అక్కడికక్కడే దుర్మరణం పాలైన విద్యార్థులు
రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం
వనస్థలిపురం/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 8 (ఆంధ్ర జ్యోతి): అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి అమితవేగంతో కారులో దూసుకొస్తూ.. బైకుపై యూటర్న్ తీసుకోబోతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ఢీకొట్టడంతో పాటు వారిని 100 మీటర్ల మేర బైకుతో సహా ఈడ్చుకెళ్లాడు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యారులూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు ఓ పాదచారుడిని సైతం ఢీకొనడంతో అతను గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కాగా మృతుల తల్లిదండ్రులు కూలి పనులు చేసి వారిని చదివిస్తున్నారు. దీంతో అమ్మానాన్నలకు భారం కాకూడదని.. జెప్టోలో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పార్శిల్ డెలివరీ చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా హాలియా మండలం, అల్వాల్‌కి చెందిన తాపీ మేస్ర్తీ కంచర్ల వెంకటేశ్వరు కుమారుడు శివ(20). సంతోష్‌నగర్‌లో ఉంటూ బండ్లగూడలోని మహావీర్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కూలీ నకిరెకంటి శ్రీరాములు కుమారుడు సందీప్‌కుమార్(20) హస్తినాపురంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ మహావీర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో సందీప్, శివ స్నేహితులయ్యారు. జెప్టో డెలివరీల్లో భాగంగా మంగళవారం రాత్రి 11.30కు హస్తినాపురంలోని ఓంకార్ నగర్‌కు వెళుతున్న కంచర్ల శివ, ఆదే ప్రాంతంలో ఉంటున్న సందీప్ కుమార్‌తో కలిసి బైక్‌పై హస్తినాపురం వచ్చి పార్సిల్ డెలివరీ చేశారు. తిరుగు ప్రయాణంలో ఎల్‌బీనగర్ వైపు వెళ్తున్నారు. ఓంకార్‌నగర్‌లో రోడ్డు మధ్య కొంత భాగం డివైడర్ తొలగించి ఉండడంతో అక్కడి నుంచి యూటర్న్ తీసుకునేందుకు రోడ్డుపై నిలిచి ఉన్నారు. ఇదే సమయంలో బీఎన్‌రెడ్డినగర్ టీచర్స్ కాలనీ ఫేజ్-2కి చెందిన కంకనాల రామ్‌కుమార్ రెడ్డి (33) స్నేహితుడితో కలిసి అతిగా మద్యం తాగి కారులో దూసుకొస్తూ... ఓంకార్‌నగర్ వద్ద రోడ్డు దాటుతున్న రంగారెడ్డి జిల్లా లోయపల్లి అంబోత్ తండాకు చెందిన సభావత్ శ్రీధర్(25)ను ఢీ కొట్టాడు. అంతే వేగంతో బైక్‌పై వేచిఉన్న శివ, సందీప్‌లను ఢీకొట్టి వారిని 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కారు ఆపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. పాదచారి శ్రీధర్ గాయపడ్డాడు. రామ్‌కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారులో ఉన్న మరో వ్యక్తి పరారైనట్లు స్థానికులు తెలిపారు. తమ తోటి విద్యార్థులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అప్పగించాలని నినాదాలు చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. మృతుల కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.