Share News

డబుల్‌ బెడ్రూం కాలనీల్లోని దుకాణాల వేలం

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:55 AM

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ) పరిధిలోని 36 డబుల్‌ బెడ్రూం కాలనీల్లో ఉన్న 1,400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డబుల్‌ బెడ్రూం కాలనీల్లోని దుకాణాల వేలం

  • నేటి నుంచి ఈ నెల 21 వరకు నిర్వహణ

  • క్యూర్‌ పరిధిలో 36 కాలనీల్లో 1,400కు పైగా దుకాణాలు..

  • వేలం వద్దంటూ సీఎంకు సీపీఎం లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ) పరిధిలోని 36 డబుల్‌ బెడ్రూం కాలనీల్లో ఉన్న 1,400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నుంచి ఈ నెల 21 వరకు ఈ వేలం ప్రక్రియను నిర్వహించనున్నామని, దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వేలం వేయబోయే దుకాణాలు 60 చ.అడుగుల నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని.. వీటిని మార్కెట్‌ ధరల కంటే తక్కువగా నామమాత్రంగానే నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆయా కాలనీలను సందర్శించి దుకాణాలను ఎంపిక చేసుకుని, ఆ మేరకు నిర్ణీత మొత్తం డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా కాలనీల కోసమే వినియోగిస్తామని, ఇందుకోసం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని 8 కాలనీల్లోని 273 షాపులకు గురు, శుక్రవారాల్లో వేలం నిర్వహించనున్నారు. 15, 16 తేదీల్లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న 10 కాలనీల్లోని 77 దుకాణాలకు, 15, 17 తేదీల్లో మేడ్చల్‌ జిల్లాలోని 12 కాలనీల్లో ఉన్న 892 దుకాణాలు, 15, 18, 21న సంగారెడ్డి జిల్లాలోని 6 కాలనీల్లో ఉన్న 372 షాపులకు వేలం నిర్వహించనున్నట్టు ప్రకటనలో వివరించారు. అయితే ఈ వేలంపై అభ్యంతరం తెలుపుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ రాసింది.


దుకాణాలను వేలం ద్వారా విక్రయించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అందులో డిమాండ్‌ చేశారు. వేలం వేయడమనేది పేద ప్రజలు, నివాసితుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని డిపాజిట్‌ చేసి.. ఆ వడ్డీతో కాలనీల నిర్వహణ చేపడతామనే ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణాత్మకం కాదన్నారు. ప్రభుత్వం స్పందించి డబుల్‌ బెడ్రూం కాలనీల్లో నివాసముంటున్న ప్రజల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.

Updated Date - Apr 09 , 2026 | 06:56 AM